Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తాడ్వాయి
గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని సీపీఐ(ఎం) ములుగు జిల్లా జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పులిగుజ్జు వెంకన్న అటవి అధికారులను హెచ్చరించారు. మండలంలోని జలగలంచ గొత్తికోయ ఆదివాసీ గూడెంలో మంగళవారం గిరిజనులకు, అటవీ అధికారులకు మధ్య జరిగిన భౌతిక దాడుల క్రమంలో గిరిజనులకు మద్దతుగా మాట్లాడారు. గొత్తికోయ ఆదివాసీ గిరిజనులు పోడు భూమిని నాగండ్ల తో దున్నుతుండగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బాలకష్ణ, బేస్ క్యాంప్ సిబ్బంది నాగబాబు అక్కడికి చేరుకొని నాగలి దున్నుతున్న ఆదివాసీ గిరిజన మహిళ ఎట్టి సమ్మక్క పట్ల దుర్భాషలాడుతూ భౌతిక దాడి నిర్వహించారన్నారు. కొయ్య నాగలిని గొడ్డలితో నరికారని, మడకం ఇడమయ్యా, చేమల కొస్సయ్య, మడవి రాములను తీవ్రంగా గాయపరిచారని ధ్వజమెత్తారు. ఫారెస్ట్ అధికారులపై చట్టరీత్యా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు, నిత్యం వేధింపులే అని, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఫారెస్ట్ అధికారులు గిరిజన మహిళపై దాడి చేసి చెట్లకు కట్టేసి కొట్టిన ఘటనను నిరసిస్తూ సీపీఐ(ఎం), ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశామని గుర్తు చేశారు. నాడు హైకోర్టు గిరిజనులపై, వారి ఇళ్లపై దాడి చేయొద్దని, వారికి రక్షణ కల్పించాలని పేర్కొన్నా నేడు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. గిరిజనులకు, గిరిజన ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి విరుద్ధంగా అటవీశాఖ అధికారులు, ఆదివాసీ గిరిజనుల పట్ల వ్యవహరించే తీరు అన్యాయమని తెలిపారు. సీఎం కేసీఆర్ గిజనులకు హక్కు పత్రాలు ఇస్తామని ప్రకటించినా దాడులు మాత్రం ఆగడట్లేదన్నారు. వెంటనే దాడులు ఆపాలని దాడి చేసిన ఫారెస్ట్ అధికారుల పై చట్టరీత్య ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సాగు చేసుకునే పోడుకు హక్కు పత్రాలు ఇవ్వకపోగా చదును చేసి సాగుకు యోగ్యమైన భూములను అటవీ అభివద్ధి పేరుతో ఆక్రమణలకు దిగడం ఏంటని ప్రశ్నించారు. గిరిజనులపై దాడులకు దిగితే వారంతా ఏకమై అధికారులను, ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరక్కుండా గెదుముతారని హెచ్చరించారు. హక్కు పత్రాలు పొందేవరకు అహింసాయుత పోరాటం సాగిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో పొదిలి చిట్టిబాబు, జలగలంచ పెద్దమనిషి కురసం జోగయ్య, గొత్తికోయ ఆదివాసి గిరిజనులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.