Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానుకోట రాళ్లను గుర్తుచేస్తున్న వైనం..
- ఉద్యమద్రోహులకు టికెట్టా ?
- గులాబీల్లో ఆసక్తికర చర్చ
నవతెలంగాణ-వరంగల్
హుజురాబాద్ టిఆర్ఎస్ టికెట్ తనకే ఖరారైందని పాడి కౌశిక్‌రెడ్డి ఒక కార్యకర్తకు చెప్పిన ఆడియో లీక్ కావడంతో ఈ వ్యవహారంపై టిఆర్ఎస్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. 2010 మే 28న మానుకోటకు నాడు కడప ఎంపీ వైఎస్ జగన్ రాకను వ్యతిరేకిస్తూ ఉద్యమకారులు ఆందోళనకు దిగగా, ఆ ఆందోళనకారులపై రాళ్లు రువ్విన జగన్ అనుచరుల్ల్లో పాడి కౌశిక్‌రెడ్డి ఒకరని చెల్పూరు సర్పంచ్ మహేందర్ ఆరోపించడం గమనార్హం. అలాంటి ఉద్యమద్రోహి పాడి కౌశిక్‌రెడ్డికి టిఆర్ఎస్ టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుండడం, ఏకంగా 'పాడి' ఒక కార్యకర్తకు ఫోన్లో చెప్పడం ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఒకవైపు బిజెపి అభ్యర్థిగా ఉద్యమకారుడు ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రచారంలో ముందున్న తరుణంలో ఉద్యమ ద్రోహులకు పార్టీ టికెట్ ఇస్తే పరిస్థితి ఎలా వుంటుందన్న చర్చ నేడు హాట్ టాపిక్‌గా మారింది. 'పాడి'కే పార్టీ టికెట్‌ను సీఎం కేసీఆర్ ఖరారు చేస్తే మానుకోట ఘటన మరోమారు తెరముందుకు వచ్చే అవకాశం లేకపోలేదు.
హుజురాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ రాకముందే జరుగుతున్న రాజకీయ పరిణామాలు కేవలం హుజురాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. గత కొంత కాలంలో కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ బరిలోకి దించబోతుందన్న ప్రచారం బలంగా జరుగుతుంది. ఈ క్రమంలో 'పాడి' మంత్రి కేటీఆర్‌తో చర్చలు జరపడం లాంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలే 'పాడి' టిఆర్ఎస్ కోవర్ట్ అంటూ ఆరోపించారు. ఈ క్రమంలో హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 'పాడి' వర్గంగా, ఆయన వ్యతిరేకవర్గంగా చీలిపోయాయి. పాడి కౌశిక్‌రెడ్డి వివాదాస్పద ప్రవర్తన పట్ల కాంగ్రెస్ నాయకత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది. ఈక్రమంలో హుజురాబాద్‌లో నేనే కాంగ్రెస్ అభ్యర్థినంటూ, కాంగ్రెస్‌లోనే వుంటానంటూ కౌశిక్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం తాజాగా ఒక బిజెపి కార్యకర్త విజేందర్కు ఫోన్ చేసి తనకు టిఆర్ఎస్ టికెట్ ఖరారైందని చెప్పిన ఆడియో రికార్డింగ్ లీక్ చేయడంతో 'పాడి' ఇరుక్కుపోయారు. దీంతో అదునుకోసం చూస్తున్న కాంగ్రెస్ నాయకత్వం యుద్ధప్రాతిపదికన సమావేశమై 24 గంటల్లో వివరణనివ్వాలని షోకాజ్ జారీ చేశారు. ఈ క్రమంలో 'పాడి' విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ వెంటనే 'పాడి'ని పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే క్రమంలో కాంగ్రెస్ బహిష్కరించడమేంటి.. నేనే పార్టీకి రాజీనామా చేస్తున్నానని 'పాడి' ప్రకటించారు.
మానుకోట ఘటనలో రాళ్లురువ్విన 'పాడి'
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఓదార్పుయాత్రకు మానుకోటకు బయలుదేరిన కడప ఎంపి వైఎస్ జగన్ రాకను అడ్డుకుంటూ ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జగన్ అనుచరుడైన పాడి కౌశిక్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లురువ్వారని హుజురాబాద్ మండలం చెల్పూరు సర్పంచ్ మహేందర్ ఆరోపణలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అలాంటి తెలంగాణ ద్రోహి కౌశిక్‌రెడ్డికి టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. టిఆర్ఎస్ పార్టీ ఉద్యమద్రోహులను చేర్చుకొని ఉద్యమకారులను బయటకు పంపుతుందన్నారు. చెల్పూరు సర్పంచ్ మహేందర్ వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి.
'పాడి' వ్యాఖ్యలపై స్పందించని టిఆర్ఎస్
టిఆర్ఎస్ పార్టీ టికెట్ తనకు ఖరారైందని పాడి కౌశిక్‌రెడ్డి ప్రకటించడం పట్ల టిఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు ఎవరూ స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా పాడి కౌశిక్‌రెడ్డి టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్‌తో టచ్‌లో వుంటున్న విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో 'పాడి' వ్యాఖ్యలపై స్పందించడానికి సైతం టిఆర్ఎస్ నేతలు సుముఖంగా లేరు. హుజురాబాద్‌కు చెందిన టిఆర్ఎస్ నేత వకులాభరణం కృష్ణమోహన్ సైతం 'పాడి'కి ఎవరు హామినిచ్చారో తెలియదని స్పష్టం చేయడం గమనార్హం. 'పాడి' వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు కొట్టివేయకపోవడంతో ఆ పార్టీలో ఈ వ్యాఖ్యలు ఉద్యమకాలం నుండి పార్టీలో కొనసాగుతున్న నేతల్లో తీవ్ర అసంతృప్తిని నింపాయి. దీనిపై టిఆర్ఎస్ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది రెండు, మూడ్రోజుల్లో తేలే అవకాశం లేకపోలేదు. ఈ విషయాన్ని సైతం 'పాడి' స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 'పాడి' టిఆర్ఎస్ కోవర్ట్ అంటూ చేసిన ప్రచారానికి ఈ పరిణామాలు బలం చేకూర్చాయి.