Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య
నవతెలంగాణ- హన్మకొండ
రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పాత జిల్లాల ప్రాతిపదికన బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కే జంగయ్య డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ హంటర్ రోడ్ లోని టీఎస్‌యూటీఎఫ్ భవన్లో వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు పెండెం రాజు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాటాల్డఆరు. స్వరాష్ట్రం సిద్ధించాక ఒక్కసారి కూడా టీచర్ల పదోన్నతులు చేపట్టలేదన్నారు. అనేకమంది ఉపాధ్యాయులు ప్రమోషన్ అర్హత ఉండి కూడా రిటైర్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల వారీగా చూస్తే ఈ ప్రక్రియ మరింత జాప్యమవుతుందన్నారు. అసంబద్దలను వెంటనే సవరించాలని వివిధ అలవెన్సుల జీవోలు, అకడమిక్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. కేజీబీవీ టీచర్లు, సిబ్బందికి యుఆర్ఎస్ సిబ్బందికి బేసిక్ పే ఇవ్వాలన్నారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు కూడా బదిలీలు నిర్వహించాలన్నారు. పండిట్, పీఈటీ పోస్టులను అప్ గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులు కూడా మంజూరు చేయాలని, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు బడ్జెట్ సకాలంలో విడుదల చేయాలని కోరారు. వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన విధులు నిర్వహించిన హెచ్ఎంలకు సంబంధిత సెలవులు ఇవ్వాలన్నారు. పీఆర్సీ ఫిక్సేషన్ పారదర్శకంగా చేయాలని సమావేశం తీర్మానించింది. టీఎస్‌యూటీఎఫ్ ఎఫ్ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందెం రాజు మాట్లాడుతూ.. రేషనలైజేషన్ పేరుతో మూసివేత, ఉపాధ్యాయ పోస్టుల కుదింపు చేస్తే పోరాడతామని హెచ్చరించారు. అనంతరం ఉపాధ్యాయుల దీర్ఘకాల పెండింగ్ సమస్యల పరిష్కారానికి వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాదయాత్రను భగం చేసి అరెస్టు చేయడాన్ని ఖండించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచి వేయడం సరికాదన్నారు. శాంతియుతంగా చర్చలకు పిలిచి ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సమావేశం తీర్మానించిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సీిహెచ్ రఘుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దామోదర్, సువర్ణ, గ్రేస్ జిల్లా కోశాధికారి సుజన్ ప్రసాద్, జిల్లా కార్యదర్శులు మల్లిక్, జి విజరు, శ్రీనివాస్, ఆడిట్ కమిటీ కన్వీనర్ టి లింగమూర్తి, సభ్యులు చంద్రయ్య, పోక శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.