Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటీకరణ, కాంట్రాక్టీరణకు వ్యతిరేకంగా
- దశలవారీ ఆందోళనలు చేపడుతాం
- ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్‌కుమార్
నవతెలంగాణ-భూపాలపల్లి
టీఆర్ఎస్ పాలనలో సింగరేణి సంస్థ కుదేలవు తోందని, ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ విధానాలతో సింగరేణి నిర్వీర్యానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కుమార్ అన్నారు. ఆదివారం భూపాలపల్లి లోని కొమురయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడారు. భూపాలపల్లి సింగరేణి డివిజన్ పరిధి భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్ గనులగా మార్చుతున్నారని ఫలితంగా కార్మికుల సంఖ్య కుదించబడుతుందన్నారు. యాంత్రీకరణ ద్వారానే బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుందన్నారు. భూపాలపల్లి సింగరేణి డివిజన్ పరిధి కేటీకే ఎనిమిదవ గనిలో 18 లక్షల టన్నుల బొగ్గును వెలికి తీసేందుకు 188 కోట్ల రూపా యలతో ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టు పనులు అప్పగిం చేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారన్నారు. భూపాలపల్లి డివిజన్లో ఎనిమిది వేల పైచిలుకు కార్మికులు పనిచేసే వారని, ప్రైవేటీకరణ కాంట్రాక్ట్ విధానం వల్ల ప్రస్తుతం కార్మికుల సంఖ్య 5600 వరకు కుదించబడ్డారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సింగరేణిలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు ఉండరని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు యత్నించడం సరికాదన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితి పూర్తై 20 నెలలు కావస్తున్నదని, ఎన్నికలు జరగకుండా టీఆర్ఎస్ నాయకులు, ఆ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు మోకాలడ్డు తున్నారని ఆరోపించారు. కార్మికుల సంక్షేమానికి పోరాడాల్సిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం యాజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యలు చేపట్టినప్పటికీ నోరు మెదపడం లేదని అన్నారు సింగరేణిలో ప్రైవేటీకరణ ఆపకపోతే ఆగస్టు నుండి అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ముందు నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐటియుసి భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్ మాట్లాడుతూ... సింగరేణిలో ప్రైవేటీకరణ యాంత్రీకరణ చేపడుతున్న యాజమాన్యానికి వంత పాడుతున్న టీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులకు త్వరలోనే బుద్ధి చెబుతారన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న యాజమాన్యానికి టీబీజీకేఎస్‌కు కార్మికులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ నాయకులు మాతంగి నర్సయ్య మున్సిపల్ కౌన్సిలర్ నూకల భూమక్క చంద్రమౌళి, విజేందర్, పి కష్ణ, అహ్మద్, బీమా, కొమురయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఏఐటీయూసీలో చేరడం హర్షణీయం
భూపాలపల్లి ఓసీ-3 బ్లాస్టింగ్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు 30మంది ఏఐటీయూసీలో చేరడం హర్షించదగ్గ విషయమని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మోట పలుకుల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి కుడుదుల వెంకటేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం కొమురయ్య భవనంలో కొడుదుల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రమేష్ మాట్లాడారు. కార్మికులకు వెన్నంటే ఉంటూ వారి హక్కుల సాధన కోసం పోరాట దిశగా పనిచేస్తుందని అన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా అల్లంరాజు అధ్యక్షులుగా చిత్తారి అశోక్, ఉపాధ్యక్షులుగా ఉడుత సాంబయ్య, ప్రధాన కార్యదర్శిగా పెండ్యాల చంద్రమౌళి సహాయ కార్యదర్శిగా హిట్టేనా బాలరాజ్, కోశాధికారిగా గుర్రాల అన్వేష్, కార్యవర్గ సభ్యులుగా తాళ్లపల్లి రవి, కట్ల రవి దుర్గ, మహేందర్, సభ్యుల్ని ఎన్నుకున్నారు.