Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజుకో ఆందోళన
- ఎమ్మెల్యేపై విమర్శలు
నవతెలంగాణ-వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల కేంద్రం గా మరో జిల్లా కోసం స్థానిక రాజకీయ పార్టీలు, సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమాన్ని ప్రారంభించారు. వారం రోజులుగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజాం పాలన లోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న పరకాల చరిత్ర నానాటికి అడుగంటి పోతున్నదని, ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో తీవ్రమైన అన్యాయం జరిగిందని అఖిలపక్ష నేతలు తీవ్రంగా విమర్శి స్తున్నారు. పరకాలకు ముందు నుండి అన్యా యం జరుగుతూనే వుందని, గతంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని అక్రమంగా తరలించు కుపోతే నాటి ప్రజాప్రతినిధులు పట్టించుకో లేదని ఆరోపించారు. నాటి నుండి నేటి వరకు పరకాల ప్రత్యేకతను, చరిత్రను, వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రజాప్రతినిధులు పట్టించు కున్న పాపాన పోలేదని, ఇకనైనా పరకాల కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయడానికి ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి పూనుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పటికే 6 జిల్లాలుగా విభజించారు. ముందు వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి ప్రతిపాదనలే ఉండగా, అనంతరం మహబూబా బాద్, జనగామ, ములుగు జిల్లాలను ఏర్పాటు చేశారు. వీటి కంటే ఎంతో ప్రత్యేకతలు, చరిత్ర వున్న పరకాలను విస్మరించడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తితో వున్నారు. ఈ అసంతృప్తే పరకాల జిల్లా కోసం ఉద్యమించేలా చేసింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల కేంద్రంగా అమరవీరుల జిల్లాను ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. వారం రోజుల క్రితం అన్ని రాజకీయ పార్టీలు కలిసి సమావేశం నిర్వహించి పరకాల అమరవీరుల జిల్లా సాధన సమితిని ఏర్పాటు చేశాయి. ఈ కమిటీకి కన్వీనర్‌గా పిట్ట వీరస్వామి, కోకన్వీనర్లుగా దుబాసి వెంకటస్వామి, మార్త భిక్షపతిలను ఎన్నుకొని జిల్లా కోసం ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. అందులో భాగంగానే ప్రతిరోజు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పరకాల అమరవీరుల జిల్లా సాధన సమితి ఆందోళన కార్యక్రమాలతో అధికార టీఆర్ఎస్పై ఒత్తిడి పెరుగుతుంది. ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకొని అఖిలపక్ష నేతలు కార్యక్రమాలను నిర్వహి స్తుండడంతో టిఆర్ఎస్ నేతలు నేటికీ ఈ విషయంలో పెదవి విప్పడం లేదు.
గతం నుండి అన్యాయమే..
పరకాల 1983కు ముందే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా వుంది. సబ్ కలెక్టర్ కార్యాలయం వుండేది. టిడిపి ప్రభుత్వం ఏర్పడ్డాక 1984 నాటి మంత్రి చందూలాల్ పరకాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని అర్ధరాత్రి ములుగుకు తరలించారు. దీనికి నిరసనగా పెద్దఎత్తున అఖిలపక్షాలు ఆందోళన కార్యక్ర మాలు నిర్వహించారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి పరకాలకు వచ్చిన మంత్రి చందూలాల్‌పై నాడు బిజెపి నేతలు చెప్పులతో దాడి చేశారు. నాటి నుండి నేటి వరకు పరకాల అభివృద్ధిలో తీవ్రమైన అన్యాయం జరుగు తూనే వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనలో మరింత అన్యాయం జరి గింది. పరకాలతో నిత్య సంబంధాలు కలిగిన రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల మండలాలను భూపాలపల్లి నియోజకవర్గం చేసి అందులో విలీనం చేశారు. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా వున్న పరకాలకు అవకాశం ఇవ్వకుండా పరకాల కంటే ముందే భూపాలపల్లిని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేశారు. పరకాల కంటే ముందే నర్సంపేట డివిజన్ కేంద్రంగా మారింది. స్థానిక ఎమ్మెల్యేలు ఎవ రున్నా ఈ మేరకు పరకాల ప్రాధాన్యతను ఇనుమడింపచేసే విధంగా అభివృద్ధి చేయలేకపోయారు. అభివృద్ధి చేయకపోగా, జరుగుతున్న నష్టాన్ని అడ్డుకోలేక పోయారు. ఈ అన్యాయం పట్ల పరకాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది.
పరకాల చరిత్రకు మచ్చ..
పరకాలను మరో జలియన్‌వాలా బాగ్గా పిలుస్తారు. నిజాం పాలనలో తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా పరకాల కేంద్రంగా పోరాటం జరిగింది. ఆ పోరాటానికి సాక్ష్యమే మరో జలియన్‌వాలాబాగ్ పరకాల చరిత్ర. జలియన్ వాలాబాగ్‌లో జరిగినట్టుగానే పరకాలలో రజాకార్లు సమావేశంలో వున్న ఉద్యమకారులపై కాల్పులు జరిపారు. 1947 సెప్టెంబర్ 2వ తేదీన పరకాల పట్టణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి సుమారు 1,500 మంది సమావేశమయ్యారు. ఈ సమావేశంపై రజాకార్లు, నిజాం సైన్యం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 22 మంది మృతిచెందారు. 150 మంది గాయపడ్డారు. ఈ ఉద్యమకారుల స్మారకార్ధం పరకాల పట్టణంలో అమర ధామం నిర్మించారు. నాటి త్యాగధనులను నేటికీ ప్రతియేటా పరకాల ప్రజ లను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తారు. అలాంటి చారిత్రాత్మకమైన పరకాల చరిత్రను విస్మరించి పరకాలకు ఎలాంటి ప్రాధాన్యత దక్కకుండా చేయడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పరకాల అమరవీరుల జిల్లా సాధన సమితి ఏర్పాటయ్యింది.
ఇబ్బందుల్లో అధికార టీఆర్ఎస్
పరకాలలో అఖిలపక్షాల నేతృత్వంలో పరకాల అమరవీరుల జిల్లా సాధన సమితిని ఏర్పాటు చేసి ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించడంతో అధికార టిఆర్ఎస్ ఇరుకునపడింది. పరకాలకు జరిగిన అన్యాయాన్ని ఎకరువు పెడుతూ ఉద్యమకారులు ఎమ్మెల్యే చేతకానితనమే ఇందుకు కారణమని విమర్శిస్తుండడంతో అధికార టిఆర్ఎస్ నేతలు స్వీయరక్షణలో పడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటులో తీవ్ర జాప్యంతో అధికార టిఆర్ఎస్పై స్థానికులు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. ఈ క్రమంలో జిల్లా ఏర్పాటుకు ఆందోళన కార్యక్రమాలను ముమ్మరం చేయడంతో అధికార పార్టీ నేతలు ఈ విషయంపై నేటికీ పెదవి విప్పడం లేదు. మున్ముందు ఈ ఉద్యమం ఎంత తీవ్రతమవుతుందో మరీ.