Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు బురదమయం.. తిప్పలు..
నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రం నుంచి నైనాల గ్రామానికి వెళ్లే దారి బురదమయంగా మారిన క్రమంలో గతంలో పలు మార్లు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ఇకనైనా స్పందించాలని మండల ప్రజలు కోరుతున్నారు. మండల కేంద్రం నుంచి నైనాల వెళ్లే దారి సుమారు 30 ఏండ్లుగా గుంతలమయమై నడవడానికి సైతం ఇబ్బందికరంగా తయారైంది. మండల కేంద్రం నుంచి ఊర చెరువు బైపాస్ వెంట ఉన్న బండ్ల బాటగా ఉన్న ఇండియన్ గ్యాస్ వెనక నుంచి నైనాల గ్రామానికి వెళ్లే పాత డొంక దారి సుమారు ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ దారికి గ్రామం నుంచి ప్రతిరోజూ సుమారు 100 మంది రైతులు, ప్రజలు నిత్యం వ్యవసాయం, ఇతర పనుల కోసం ప్రయాణం సాగిస్తారు. నాట్లు వేయడానికి, వరి కలుపు తీయడానికి, పత్తి చేను వేయడానికి వేయడానికి, మిరప పంట సాగు చేయడానికి, తదితర పనుల కోసం బురదలోంచే నడవాల్సి వస్తోంది. ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో బురదగుంటలు ఏర్పడి రైతులు ప్రమాదాల బారిన పడుతున్న దుస్థితి నెలకొంది. ఈ దారిలో ప్రయాణించే సుమారు 100 మంది రైతులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని నడవాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. సైకిళ్లు, ఎడ్లబండ్లు సైతం రాకపోకలు సాగించలేని విధంగా రోడ్డు బురదమయంగా మారింది. కొన్ని నెలలుగా ఎమ్మెల్యేకు, ఎంపీకి, ఇతర ప్రజాప్రతినిధులను, అధికారులకు సమస్యను వివరించినా ఎవరూ పట్టించు కోవడం లేదంటూ రైతులు వాపోతున్నారు. పండించిన పంటను బురద దారిలో ఎడ్లబండ్ల లో తీసుకురాలేక పోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి లేక నానా తంటాలు పడుతున్నామని తెలిపారు. బండ్లు నడవలేని దుస్థితిలో తప్పనిసరి పరిస్థితుల్లో పంటను ట్రాక్టర్లలో తీసుకురావడానికి భారీగా కిరాయి చెల్లించాల్సి వస్తోందని రైతన్నలు చెప్పారు. గతంలో పలు మార్లు హామీ ఇచ్చిన క్రమంలో ఇప్పటికైనా ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ స్పందించి రోడ్డు సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు. వివరణ కోసం ప్రయత్నించగా అధికారులు అందుబాటులోకి రాలేదు.
బీటీ రోడ్డు వేయాలి : కావటి కొమురయ్య, రైతు
రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రం నుంచి నైనాల వరకు బీటీ రోడ్డు వేయాలి. దశాబ్దాలుగా రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించు కోవడం లేదు. వర్షాల కారణంగా రోడ్డు బురదమయమై నడవడానికి సైతం ఇబ్బంది పడుతున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి. ఎడ్లబండ్లు నడవలేని పరిస్థితుల్లో ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను పొలాల నుంచి ఇండ్లకు, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించ డానికి ట్రాక్టర్లను అద్దెకు మాట్లాడుకుని ఆర్థికంగా భారీగా నష్టపోతున్నాం.
ప్రమాదాల బారిన పడుతున్నాం.. : మల్లం యాకయ్య, రైతు
నైనాల వెళ్లే దారిలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదాల బారిన పడుతున్నాం. వృద్ధ రైతులు, మహిళా కూలీలు బురద గుంటల్లో కాలు జారి చేతులు, కాళ్లు విరగ్గొట్టుకుంటున్న దుస్థితి నెలకొంది. సైకిళ్లు, ఎడ్లబండ్లు కూడా ప్రయాణం సాగించలేని పరిస్థితిలో ఉండగా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు