Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
- పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-ములుగు
సీఎం కేసీఆర్ నియంతృత్వం వల్లే రాష్ట్రం అప్పుల పాలైందని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యకర్తలు సమన్వయంతో రెండేండ్లపాటు పని చేసి కేసీఆర్ పాలనకు అంతం పలకాలని, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేలా గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేపట్టాలని సూచించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు పార్టీ, అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. సీఎంకు ఉప ఎన్నికలు రాగానే దళితులు, బీసీలు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ భూముల విక్రయం పట్ల ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదని మండిపడ్డారు. ఏడేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు భూపంపిణీ, తదితర అనేక హామీలను విస్మరించారని విమర్శించారు. అన్ని తరగతుల ప్రజలను, ఉద్యోగులను, కార్మికులను, రైతులను వంచించిన సీఎం కేసీఆర్‌కు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలు, నాయకులు పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అయూబ్ ఖాన్, మహిళా విభాగం అధ్యక్షురాలు కొమురం ధనలక్ష్మీ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పల్నాటి నాగేశ్వర్రావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.