Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీలక పోస్టులు ఖాళీ
- ఉద్యోగులపై అదనపు భారం
- అభివృద్ధి పనులపై దుష్ప్రభావం
నవతెలంగాణ-తొర్రూరు
తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలోని ఉద్యోగ ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారన్న ప్రశ్న ప్రజలను వేధిస్తోంది. ఏండ్ల తరబడిగా పలు కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో విధుల్లో ఉన్న ఉద్యోగులపై అదనపు భారం పడుతోంది. అంతిమంగా ఖాళీల ప్రభావం అభివద్ధి పనులపై స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ ప్రజలకు సకాలంలో సేవలు అందని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు, విధుల్లో ఉన్న ఉద్యోగులకు పాట్లు తప్పడం లేదు.
20 వేల జనాభా
తొర్రూరు మున్సిపాల్టీ పరిధిలో మొత్తం 16 వార్డులుండగా 9 వేల 914 కుటుంబాలతో సుమారు 20 వేల జనాభా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. నిత్యం వందలాది మంది వివిధ పనుల నిమిత్తం మున్సిపల్ కార్యాలయానికి రాకపోకలు సాగించడం పరిపాటి. అయితే సకాలంలో పనులు జరగకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురౌతున్నారు. అంతే కాకుండా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి చేపడుతున్న అభివృద్ధి పనులపై పర్యవేక్షణ కొరవడుతోందన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. పట్టణంలో వివిధ రకాల పన్నులు వసూళ్లలోనూ జాప్యం జరుగుతోందని తెలు స్తోంది. అరకొర సిబ్బందితో పనులు చేపడు తున్నట్లు అధికారులు సైతం ఒప్పుకుంటున్నారు.
మున్సిపాల్టీలో ఖాళీలు
తొర్రూరు మున్సిపాల్టీలో పూర్తి స్థాయి సిబ్బంది లేరు. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాల్టీ ఏర్పడి రెండేండ్లు గడచినా కీలకమైన మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉండగా ఇటీవల భర్తీ చేశారు. మూడు టీపీఓ, ఒక టీపీఎస్ పోస్టులూ ఖాళీగానే వెక్కిరిస్తున్నాయి. టీపీబీఓ, ఏఈ పోస్టుల్లో ఇన్ఛార్జీలు విధులు నిర్వహిస్తున్నారు. వర్క్ ఇన్స్పెక్టర్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, యూడీఆర్ఐ పోస్టులు మున్సిపాల్టీ ఏర్పడినప్పటి నుంచి ఖాళీగానే ఉన్నాయి. ఆరుగురు బిల్ కలెక్టర్లు, ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఒక అసిస్టెంట్ విధులు నిర్వర్తిస్తున్నారు. మున్సిపల్ ఉద్యోగ ఖాళీలపై రాష్ట్ర మున్సిపల్ శాఖ ఇప్పట్లో దష్టిసారించేలా కనిపించడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాల్టీలో ఉద్యోగ ఖాళీలన్నిటినీ భర్తీ చేసి ప్రజలకు సకాలంలో మెరుగైన సేవలు అందేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.