Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరగనున్న వరి, మొక్కజొన్న
నవతెలంగాణ-వరంగల్
2021 వానాకాలం పంటల సాగు విస్తీర్ణాన్ని పరిశీలిస్తే గతేడాది కంటే వరి, మొక్కజొన్న సాగు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈసారి గతేడాది కంటే జిల్లాలో మొక్కజొన్న విస్తీర్ణం గణనీయంగా పెరుగనుంది. గతేడాది వానాకాలంలో వరి 96 వేల 416 హెక్టార్లలో సాగు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు 72 వేల 944 హెక్టార్లలో వరి సాగయ్యింది. వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆగస్టు నాటికి వరి లక్ష ఎకరాలు సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో ఈసారి పత్తిసాగు తగ్గుముఖం పట్టనుంది. గతేడాది 82 వేల 946 ఎకరాల్లో పత్తి సాగు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు 47 వేల 705 ఎకరాల్లో మాత్రమే సాగయ్యింది. ఇంకా పెరిగినా 10-15 వేల ఎకరాలకు మించి పెరిగే అవకాశం కనిపించడం లేదు. గతేడాదితో పోల్చితే పత్తి సాగు సుమారు 20 వేల ఎకరాల మేరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది.
వరంగల్ అర్భన్ జిల్లాలో 11 మండలాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అంతటా వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పత్తి విత్తారు. తొలి వర్షాలకే రైతులు పత్తి గింజలు విత్తారు. వరి సాగు వివరాలు ఆగస్ట్ నెలాఖరుకు స్పష్టంగా తెలిసే అవకాశముంది. ఇప్పటివరకు 72 వేల 944 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఆగస్టు చివరి నాటికి మరింత సాగు పెరిగే అవకాశముంది. గతేడాది వానాకాలంలో వరి 96 వేల 416 ఎకరాలలో వరిని సాగు చేశారు. ఈ వానాకాలంలో సకాలంలో వర్షాలు కురియడంతో రైతులు సాగు పనుల్లో నిమగమయ్యారు.
పెరుగనున్న వరి సాగు
ఈ వానాకాలంలో గతేడాది కంటే వరి సాగు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతేడాది 96 వేల 416 ఎకరాల్లో వరి సాగైంది. ఈ ఏడాది ఈనెల 13 నాటికి వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం సుమారు 73 వేల ఎకరాల్లో వరి సాగైంది. వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ఆగస్టు నెలాఖరు నాటికి లక్ష ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది నుంచి వరి సన్నాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రచారం గణనీయంగా తగ్గనున్న పత్తి
చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో సహజంగానే వరి సాగు గణనీయంగా పెరుగుతుంది.
తగ్గుతున్న పత్తి విస్తీర్ణం
వరంగల్ అర్భన్ జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు గణనీయంగా తగ్గుముఖం పట్టనుంది. గతేడాది జిల్లాలో 82 వేల 946 ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది ఇప్పటివరకు 47 వేల 705 ఎకరాల్లో సాగు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా మరో 10-15 వేల ఎకరాలు పెరిగే అవకాశం లేకపోలేదు. మొత్తంగా పత్తి 60-62 వేల ఎకరాల మేరకు సాగు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. గత వానాకాలంతో పోల్చితే ఈసారి పత్తి సాగు 20 వేల ఎకరాల మేరకు తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరి, పత్తి సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి తారాస్థాయిలో ప్రచారం చేసోంది. ఈ ప్రచారం నేపథ్యంలో వరి సాగు పెరిగినా, ఈ ఏడాది పత్తి సాగు గణనీయంగా తగ్గడం గమనార్హం.
పెరుగనున్న మొక్కజొన్న సాగు
గతంలో కంటే మొక్కజొన్న సాగు గణనీయంగా పెరుగనుంది. గతేడాది జిల్లాలో మొక్కజొన్న 933 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు 3,341 ఎకరాలలో సాగు చేస్తున్నారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో వ్యవసాయ శాఖ మొక్కజొన్నను సాగు చేయొద్దని ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంతో గతేడాది మొక్కజొన్న సాగు తగ్గినా, ఈ ఏడాది గణనీయంగా పెరిగింది.
ముమ్మరంగా సాగుతున్న వరి నాట్లు
సకాలంలో వర్షాలు కురవడంతో జిల్లాలో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తయ్యే అవకాశముంది. జిల్లాలో అపరాల సాగు తగ్గుముఖం పడుతోంది. గతేడాది కందులు 5,841 ఎకరాల్లో సాగు చేయగా ఈసారి 1,278 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. పెసర, మినుముల సాగు కూడా తగ్గుముఖం పట్టింది. చిరు ధాన్యాలు రాగులు, కొర్రలు, అరికలు, వరుగలు సైతం జిల్లాలో పలు గ్రామాల్లో సాగు చేయడం గమనార్హం. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగవుతున్న నేపథ్యంలో అధికారిక లెక్కలు కొలిక్కి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది.
పత్తి తగ్గుముఖం : దామోదర్‌రెడ్డి, ఏడీఏ
జిల్లాలో ఈసారి పత్తి సాగు తగ్గుముఖం పట్టే అవకాశముంది. వరి సాగు సుమారు లక్ష ఎకరాలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్న క్రమంలో ఆగస్టు నెలాఖరు నాటికి నాట్లు పూర్తయితే జిల్లాలో వరి సాగుతోపాటు ఇతర పంటల సాగు విస్తీర్ణాల గణాంకాల్లో నెలాఖరు నాటికి స్పష్టత వచ్చే అవకాశముంది.