Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణకు స్పందన..
నవతెలంగాణ-మంగపేట
ఐసీపీఎస్ అధికారులు బాల కార్మికుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేశారు. 'పారిశుధ్య పనుల్లో బాల కార్మికులు' శీర్షికతో ప్రచురితమైన 'నవతెలంగాణ' కథనానికి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటక్షన్ సర్వీసెస్ (ఐసీపీఎస్) ప్రొటెక్షన్ అధికారి నన్నెబోయిన హరికృష్ణ బుధవారం స్పందించారు. మండల కేంద్రానికి చేరుకున్న ఐసీపీఎస్ అధికారులు పంచాయతీ కార్యదర్శి హీరూనాయక్తో మాట్లాడారు. బాల కార్మికులతో పారిశుధ్య చేయించిన విషయమై వివరణ కోరారు. అనంతరం సదరు బాలల తల్లిదండ్రులను కలిసి వివరాలు సేకరించారు. పిల్లలు మంగపేట ప్రభుత్వ ప్రధమిక పాఠశాలలో చదువుతున్నారని, తరగతులు లేకపోవడం, తమ ఆవాసాలకు సమీపంలో గౌరారం వాగు ఉందని, తాము పనులకు వెళ్తే పిల్లలు వాగులో ఈతకు వెళ్లుతున్నారని బాలల తల్లిదండ్రులు తెలపారు. వర్షాకాలం వరద ఉధతి ఎక్కువగా ఉన్న క్రమంలో తమతోపాటు పనులకు తీసుకెళ్తున్నట్టు చెప్పారు. అనంతరం ఐసీపీఎస్ పీఓ హరికష్ణ మాట్లాడారు. 18 ఏండ్లలోపు బాలల చేత కూలీ పనులు చేయించడం చట్టప్రకారం నేరమన్నారు. వారి భవిష్యత్ కోసం సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పారిశుధ్య, ఇతర పనుల్లో బాలకార్మికులను పెట్టుకోవద్దని పంచాయతీ కార్యదర్శి హీరూనాయక్కు, కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు.