Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాకాలలో 20 అడుగులు, మాధన్నపేట
- 16.10అడుగుల నీటిమట్టం మంపుబారిన ఎన్టీఆర్ నగర్..
- సహాయక చర్యలకై అప్రమత్తం..
నవతెలంగాణ-నర్సంపేట
రెండ్రోజులుగా నిరవధికంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి.. చెరువులు అలుగుల పరవళ్లు తొక్కుతున్నాయి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతి పెద్ద చెరువు పాకాలలో 30 అడుగులకు 20 అడుగుల నీటి మట్టం చేరుకోగా మాధన్నపేట పెద్ద చెరువులో 16.10 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టం చేరుకొని మత్తడి పడుతుంది. రంగయ్య చెరువులోకి భారీగా నీరు చేరుకుంటుంది. డివిజన్లోని 356 చెరువుల్లోకి వరద నీరు భారీ స్థాయిలో వస్తుంది. నిరవధికంగా కురుస్తున్న భారీ వర్షంతో పట్టణంలో ముంపు ప్రాంతాల్లో నీరు ప్రవాహంలా వస్తుంది. ఎన్టీఆర్ నగర్ మరో సారి ముంపుబారిన పడే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మాధన్నపేట పెద్ద చెరువు అలుగు పడుతూ వట్టెవాగు పొంగి పొర్లుతుండడంతో ఎన్టీఆర్ నగర్ మరో సారి ద్వీపకల్పంగా మారుతోంది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, కమిషనర్ విద్యాధర్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. వాగు పరీవాహం నుంచి భారీగా వరద చేరుకుంటున్నందున ఎన్టీఆర్ నగర్ వాసులకు హెచ్చరికలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని ప్రకటించారు. సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధపడుతున్నట్లు తెలిపారు. మండలంలోని గురిజాల రోడ్డులోని పెద్దం చెరువురోడ్ డ్యామ్ మీదుగా బారీగా నీరు ప్రవహిస్తోంది. మొన్నటి వర్షాలకు వరద ప్రవాహంతో ఇదే వాగులో ఓ వ్యక్తి కొట్టుకపోయి మృతి చెందిన ఘటనలో అధికారులు తగు సహాయ చర్యలు చేపడుతున్నారు. సర్పంచ్ గొడిశాల మమత సదానందం, ఇంజనీరు అధికారులు లోలెవల్ కాజ్వేను సందర్శించారు. తాత్కాలిక మరమతు పనులను చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న 48గంటల పాటు కురిసే భారీ వర్షాల సూచనతో అధికారులు మంపు ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలకు సిద్ధ పడుతున్నట్లు చెప్పారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.