Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- జిల్లా ఇన్చార్జి ఎస్పీ సంగ్రామ్సింగ్జి పాటిల్
నవతెలంగాణ-భూపాలపల్లి
'జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మరో రెండుమూడు రోజులు కూడా భారీ వానలు పడే అవకాశముంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలి.' అని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఆదేశించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో పొంగుతున్న వాగుల వద్ద హెచ్చరికలు, వేరే దారులను సూచించే గుర్తులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పాత ఇండ్లలో ఉన్నవారిని గుర్తించి సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్ట్లనుంచి సుమారు ఆరు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వచ్చే అవకాశం ఉందని, గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, బర్ల, గొర్ల కాపర్లు, చేపల వేటకు వెళ్లే వారు గోదావరి నదికి వెళ్లొద్దన్నారు. కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ ప్రదేశాల వద్ద ఎవరికీ అనుమతి లేదని అన్నారు. ఎవరూ కూడా నీటి ప్రవాహాల వద్ద ఫోటోలు, సెల్ఫీల కోసం వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ప్రజలు పోలిస్శాఖకు సహకరించాలని కోరారు. భారీ వరదలు, వర్షాల క్రమంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఏవైనా సంఘటనలు జరిగితే పోలీసులకు గానీ, డయల్ 100కు గానీ సమాచారమందించాలన్నారు.
ప్రజలకు ఇబ్బందులు తలెత్తొద్దు : జిల్లా కలెక్టర్
అధిక వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండడంతోపాటు జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య గురువారం ఆదేశించారు. నదులు, వాగులు, కాలువలకు వరదలు ప్రమాదకర స్థాయిలో వస్తున్నందున ఆయా ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస ఏర్పాట్లు చేయాలన్నారు. లోలెవెల్ వంతెనల వద్ద నీటి ప్రవాహంలో ప్రజలు దాటకుండా హెచ్చరించా లన్నారు. వర్షాల నేపథ్యంలో అన్ని స్థాయిల అధికారులకు సెలవులురద్దు చేసినట్టు తెలిపారు. మండల, గ్రామ స్థాయి వరద నియంత్రణ కమిటీలు చురుగ్గా వ్యవహరించి వరద నియంత్రణ చర్యలు పగడ్బందీగా చేపట్టాలన్నారు.
మల్హర్రావు : కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి మానేరుకు నీరు వదులుతున్నందున మానేరులోకి మొత్తం 7లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోందని, మండలంలోని మానేరు పరివాహక ప్రాంతాలైన తాడిచెర్ల, మాల్లారం, పివి నగర్, వల్లేంకుంట, కుంభంపల్లి, రైతులు, ప్రజలు మానేరు తీరానికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని తహసీల్దార్ శ్రీనివాస్ గురువారం హెచ్చరించారు. గ్రామాల్లో చెరువుల వద్దకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, పొంగు తున్న వాగులు, రోడ్లు దాటకూడదని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న ఇండ్లలో ఉండొద్దని, వర్షం ఉన్న చోట విద్యుత్ వాడకంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
లింగాలఘనపురం/రఘునాథపల్లి : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు ,వంకలు పొంగే అవకాశం ఉందని లింగాలఘనపురం ఎస్సై దేవేందర్, రగునాధపల్లి ఎస్సై రాజేష్‌నాయక్ అన్నారు. గురువారం వారు విలేకర్లతో మాట్లాడుతూ... రహదారులపై కల్వర్టులున్నచోట నీటి ప్రవాహం ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువుల్లో మట్టితీత గుంతల్లో నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి చిన్నపిల్లలు అటు వైపు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజర్వాయర్ల కింద ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
గణపురం : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రాజన్ బాబు సూచించారు. గురువారం మోరంచ వాగును ఆయన పరిశీలించి మాట్లాడారు. వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలను తాకొద్దన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు మట్టి గోడలు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. చిన్న పిల్లలు, ఈత రాని వారు ఎట్టి పరిస్థితుల్లో చెరువులోకి దిగి ఈతలు కొట్టొద్దనానరు. చేపల వేటకు దూరంగా ఉండాలన్నారు.