Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాళేశ్వరం వద్ద ఉదతంగా ప్రవహిస్తున్న గోదావరి
నవతెలంగాణ-మహాదేవపూర్
మహదేవపూర్ మండలంలోని అన్నారం సరస్వతి బ్యారేజీ 66 గేట్లకు గాను 50 గేట్లు ఎత్తివేశారు.ఇన్‌ఫ్లో 3లక్షల60వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4లక్షల68వేల క్యూసెక్కుల నీరు ఉంది. బ్యారేజజీ పూర్తిస్థాయి నీటి మట్టం 10.87 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.97టీఎంసీల నీరు ఉంది. అలాగే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ 86 గేట్లకు 41 గేట్లు ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 2లక్షల50వేల250 క్యూసెక్కుల నీరు, ఔట్ ఫ్లో 2లక్షల68వేల130 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుతం 10.371టీఎంసీల నీరు ఉంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్ఆర్ఎస్పి మానేరు డ్యామ్ ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేయడంతో భారీగా వరద నీరు దిగువకు చేరుతోంది. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గొర్రెల కాపరులు, చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
బచ్చన్నపేట : మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పోచన్నపేట గ్రామంలోని పెద్దవాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ మత్తడి పోస్తుంది. చెక్ డ్యామ్ నుండి రైతులు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో నారాయణపురంకు వెళ్లే బ్రిడ్జి పై నుంచి రైతులు తమ వ్యవసాయ భూముల వద్దకు వెళ్తున్నారు. ఈ ఏడాది పునాస పంటలకు అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో అంతా వరి సాగు పైనే ఆసక్తి కనబరుస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో జోరుగా వరి నాట్లు వేస్తున్నారు. కాగా మండలంలోని జాతీయ రహదారిపై వక్షం పడిపోవడంతో ట్రాఫిక్ జాం నెలకొంది. స్థానిక పోలీసులు చెట్లును తొలగించి ట్రాఫిక్ సమస్య పరిష్కరించారు. ఈసందర్భంగా ఎస్సై లక్ష్మణరావు మాట్లాడుతూ... రాబోయే రెండు రోజులు వర్షాలు కురిస్తాయన్న వాతావరణ శాఖ తెలిపిన క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
చెరువుల జలకళ..
పాలకుర్తి : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు మత్తళ్ళు పోస్తున్నాయి. ఆయకట్టు రైతులు సాగుకు సిద్ధపడుతున్నారు. చెరువులు కుంటలు ఉండడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని బోరు బావులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.