Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ-రఘునాథపల్లి
దళితుల కుటుంబాల్లో వెలుగు నింపేలా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం దళిత బంధు పధకాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం పేద దళిత కుటుంబాలకు భరోసా ఇస్తుందన్నారు. ప్రభుత్వ సహాయంతో వారు ఎంచుకున్న పథకాలలో స్థిరపడి ఆర్థికంగా ఎదగాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, దళిత సంఘాల అభిప్రాయాల సేకరణ తర్వాతే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించారని అన్నారు. పార్టీలకతీతంగా దళితులందరూ ఈ పథకాన్ని స్వాగతించాలని కోరారు. ఈ పథకం అమలుకు ఎదురయ్యే సమస్యలను అధిగమించి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి దళిత కుటుంబాల్లో వెలుగులు నింపడమే టీిఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. రైతుబంధు, బీమా, ఆసరా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నేటి దళిత బంధు దేశం ఆశ్చర్యపోయే పథకాలని కొనియాడారు .ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీటీసీ బొల్లం మణికంఠ(అజరు), సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు, సర్పంచ్ పోకల శివ కుమార్ గుప్తా, జిల్లా నాయకులు నామాల బుచ్చయ్య, పీఏసీఎస్ చైర్మెన్ చీమలపాటి రవీందర్ జీ, మహిళ మండల అధ్యక్షురాలు మడ్లపల్లి సునీత, దుబ్బాక నగేష్ గౌడ్, బిక్షపతి నాయక్ పాల్గొన్నారు.