Authorization
Sat March 22, 2025 08:05:30 pm
- అధికారుల గైర్హాజరుపై ఎమ్మెల్యే పొదెం అసహనం
- మండల సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-వెంకటాపురం
ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కారం కోనం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమీక్షించి ప్రణాళికలు రూపొందించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రజాప్రతినిధులంతా హాజరైనా పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో 'మాకేం పని లేక సమావేశానికి వచ్చామా..?' అంటూ భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అసహనం వ్యక్తం చేశారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ చెరుకూరి సతీష్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే పొదెం వీరయ్య ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. సమావేశానికి 27 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా సగం శాఖలకు చెందిన అధికారులు మాత్రమే హాజరయ్యారు. కొన్ని శాఖలకు చెందిన అధికారులకు బదులు సిబ్బంది హాజరయ్యారు. వచ్చిన అధికారులు సైతం పూర్తి స్థాయిలో రికార్డులతో రాకపోవడంతో ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి గైర్హాజరైన అధికారులపై తీసుకోవాలని ఎంపీడీఓ అనురాధను కోరారు. మండలంలో అధికారుల తీరు హాస్యస్పదంగా ఉందని, అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు పని చేస్తున్నారని సభాముఖంగా అసహనం వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాల్లో వర్షాకాలం విద్యుత్ అంతరాయం తలెత్తకుండా చూడాలని, రైతులకు సకాలంలో మీటర్లు అందించి విద్యుత్ లైన్లు వేయాలని ఏఈఈ బెనర్జీకి చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు సలహాలు, సూచనలు అందించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉందన్నారు. మండలంలో పూర్తి స్థాయి వ్యవసాయ శాఖ అధికారిని నియమించాలన్నారు. గాలికుంటు, ఇతర వ్యాధుల నుంచి రక్షించేలా పశుసంవర్ధక శాఖ అధికారులు వైద్యం అందించాలని సూచించారు. అర్హులైన రైతులందరికీ పట్టా పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ నాగరాజును ఎమ్మెల్యే కోరారు. గిరిజనులు పోడు చేసుకుంటున్న భూములకు సంబంధించి అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తూ గిరిజన పోడు రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని, క్షేత్రస్థాయిలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములను పరిశీలించాలని అటవీ శాఖ అధికారికి చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. సమావేశానికి గైర్హాజరైన అధికారులపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపించి చర్యలు తీసుకునేలా పర్యవేక్షిస్తామని తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీ పాయం రమణ, పీఏసీఎస్ అధ్యక్షుడు చిడెం మోహన్‌రావు, వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్, ఎంపీటీసీలు గారపాటి రవి, కొండపర్తి సీతాదేవి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.