Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాజన్న
నవతెలంగాణ-బయ్యారం
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచి ప్రజలను దోచుకుంటున్నాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మండ రాజన్న విమర్శించారు. మండలంలోని ఆ పార్టీ రంగాపురం-2, జగ్గుతండా శాఖల సంయుక్త మహాసభ గురువారం నిర్వహించగా వీరయ్య, నన్నే సాహెబ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. కరోనాతో ప్రజలు ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని ఆందోళన వెలిబుచ్చారు. బీజేపీ నాయకులు రాష్ట్రంలో వాస్తవాలను మరుగున బెట్టి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్వరాష్ట్రం ఏర్పడితే ప్రజల బతుకులు బాగుపడతాయని నమ్మించిన కేసీఆర్ ఆ దిశగా చేసిందేమీ లేదన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక కూడా ప్రజల బతుకులు బాగుపడలేదని స్పష్టం చేశారు. దళితులకు భూపంపిణీ, నిరుద్యోగ భృతి, తదితర అనేక హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని తెలిపారు. కాకతీయుల కాలంలో నిర్మించిన బయ్యారం పెద్ద చెరువు కాల్వలకు ఇప్పటివరకూ శాశ్వత మరమ్మతులు చేయకపోవడంతో చివరి ఆయకట్టు రైతులు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా నిధులు మంజూరు చేసి మరమ్మతులు చెయ్యాలని డిమాండ్ చేశారు. మహాసభల్లో శాఖ కార్యదర్శులుగా కరీం, వీరయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహాసభల్లో యాదగిరి, రాము, శ్రీను, వెంకటరమణ, సిలార్, రాము, బిచ్చ, రమేష్, తదితరులు పాల్గొన్నారు.