Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో సమస్య పరిష్కారం
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
నెక్కొండ మండలం గుండ్రపల్లిలో గతంలో ఉన్న వరద కాలువను ఓ వ్యక్తి పూడ్చడంతో వర్షం నీరు నిలిచి ఇళ్లలోకి చేరింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్ద ఎత్తున నీరు రోడ్లపై నిలిచి ఇళ్లలోకి చేరుతోంది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందడంతో సర్పంచ్ రాజేశ్వర్‌రావు వారితో మాట్లాడినా ఫలితం లేకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని వరదనీరంతా ఓ కాలువద్వారా పూర్వంనుంచి వెలుతున్న క్రమంలో దొంగల మల్లయ్య అనే వ్యక్తి రోడ్డువేసి పూడ్చివేయడంతో నీరంతా ఇళ్లలోకి చేరినట్లు సర్పంచ్ చెప్పారు. వెంటనే స్పందించిన కలెక్టర్ తహసీల్దార్ వెంకన్న, ఆర్ఐ రమేష్, ఎంపీఓ రవిని ఘటనాస్థలికి పంపారు. అధికారులు ఆ వ్యక్తితో మాట్లాడి పరిష్కరించారు. వరద నీరు చేరడం వల్ల ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని అందువల్ల వెంటనే జేసీబీ సాయంతో కాలువ తీస్తున్నట్లు అధికారులు తెలిపారు. నెక్కొండ మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నీటితో జలకళను సంతరించుకున్నాయి. నెక్కొండ మీదుగా వెలుతున్న వట్టెవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నెక్కొండలో గురువారం 56.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు డిప్యూటీ తహసీల్దార్ రాజ్‌కుమార్ తెలిపారు.