Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్లోకి 'మోత్కుపల్లి'..
- 'కడియం'కు కిరికిరి
- 'ఎమ్మెల్సీ' స్థానంపై పీఠముడి
నవతెలంగాణ-వరంగల్
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి ఇది మింగుడుపడని వ్యవహారమే. గతంలో 'కడియం' కులంపై 'మోత్కుపల్లి' చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. 'మోత్కుపల్లి' ఎంట్రీ 'కడియం'ను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం లేకపోలేదు. 7 ఎమ్మెల్సీ స్థానాలు ఇటీవల ఖాళీ అయిన విషయం విదితమే. అందులో 'కడియం' సీటు కూడా వుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైతే ఎమ్మెల్సీ అవకాశం 'మోత్కుపల్లి'కి దక్కుతుందన్న ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఒకే సామాజిక వర్గం నుండి రెండు స్థానాలు ఇవ్వడం కుదరకపోవచ్చు. ఇప్పటికే 'మోత్కుపల్లి' టిఆర్ఎస్లో చేర్చుకోవడానికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఇస్తామని హామినిచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ నిర్వహించిన 'దళిత బంధు' పథకం అవగాహన సదస్సుకు 'మోత్కుపల్లి' హాజరయ్యారు. అనంతరం సీఎం కేసీఆర్‌ను అంబేద్కర్‌తో పోల్చారు. 'మోత్కుపల్లి' టీిఆర్‌ఎస్‌లో చేరితే ఆ పార్టీ అంతర్గత రాజకీయాలు కూడా వేడేక్కే అవకాశం లేకపోలేదు. 'మోత్కుపల్లి' ఏకంగా 'ఈటల'ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం గమనార్హం. 'మోత్కుపల్లి'ని హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో వినియోగించుకోవడానికి సీఎం కేసీఆర్ యోచిస్తున్నందునే, ఆయన్ను టిఆర్ఎస్లో చేర్చుకోవడానికి గ్రీన్‌సిగల్ ఇచ్చినట్లు సమాచారం.
అధికార టీిఆర్‌ఎస్ ్ట గేమ్‌ప్లాన్ ఇటు సొంత పార్టీలోనే కాకుండా అటు రాష్ట్రంలోనూ చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని ప్రకటించిన కేసీఆర్ తానే సీఎం పదవిని చేజిక్కించుకున్నాడు. అనంతరం దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ అని చెప్పి అదీ అమలు చేయలేకపోయారు. ఇదే క్రమంలో అధికారంలోకి రాగానే మాదిగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ తాటికొండ రాజయ్యను ఉపముఖ్యమంత్రిగా చేసినా త్వరితగతిన ఆయన్ను బర్తరఫ్ చేయడం రాజకీయాల్లో దుమారం రేపింది. నాటి నుండి నేటి వరకు దళిత నాయకులు, ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు అవమానాలు ఎదుర్కొంటూనే వున్నారు. దీంతో ఆయా సామాజికవర్గాలకు టీిఆర్‌ఎస్ మధ్య అగాధం ఏర్పడింది. హుజురా బాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ అగాధాన్ని పూడ్చుకుంటే తప్పా టిఆర్ఎస్ విజయం సాధించే అవకాశం లేదు. దీంతో సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగమే దళిత బంధు పథకం. అంతేకాదు మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతలను టీఆర్ఎస్లో చేర్చుకోవడం ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఇటీవల బీజేపీకి రాజీనామా చేయడం, సిఎం కేసీఆర్‌ను అంబేద్కర్‌తో పోల్చడం వెనుక 'మోత్కుపల్లి' టిఆర్ఎస్లో చేరడానికి సీఎం గ్రీన్‌సిగల్ ఇవ్వడమే కారణమని సమాచారం. ఇదిలావుంటే 'మోత్కుపల్లి' టిఆర్ఎస్లో చేరిక అదే పార్టీలోని మాజీ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరికి రుచించే అవకాశం లేదు. గతంలో 'కడియం' కులంపై 'మోత్కుపల్లి' చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరూ నేతలు ఉప కులాలు మాత్రమే వేరు కాగా, వీరిద్దరికీ పొసగకపోవడ గమనార్హం. ఇదిలావుంటే శాసనమండలిలో ఇటీవల 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించలేదు. 'మోత్కుపల్లి'ని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం కేసీఆర్ హామినివ్వడం వల్లే ఆయన బిజెపికి రాజీనామా చేసినట్లు టిఆర్ఎస్లో ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే 'మాదిగ' సామాజిక వర్గం నుండి ఒక్కరికే ఎమ్మెల్సీ స్థానం దక్కే ఛాన్స్ ఉండొచ్చు. దీంతో 'మోత్కుపల్లి'కే ఎమ్మెల్సీ పదవి దక్కితే, 'కడియం' పరిస్థితి ఏమిటీ ? అనేది చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంలో సీఎం కేసీఆర్ మరోమారు 'కడియం'కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడమే కాకుండా మంత్రి పదవిని కూడా ఇస్తారని ప్రచారం జరుగుతుంది. రాజకీయ పరిణామాలతో టిఆర్ఎస్ పార్టీలోనూ అనుక్షణం నిర్ణయాలు మారుతున్నాయి.
ఉప ఎన్నికలే కారణమా..?
'మోత్కుపల్లి'ని టీిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి హుజురాబాద్ ఉప ఎన్నికలే కారణమనే టాక్ వినిపిస్తుంది. హుజురాబాద్ నియోజక వర్గంలో ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు సీఎం కేసీఆర్ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఎస్సీల ఓట్లు వుండడంతో ఎట్టకేలకు సీఎం కేసీఆర్ దళితులను మంచి చేసుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తు న్నారు. గతంలో మాదిగ సామాజికవర్గాన్ని పట్టించుకోకపోవడం, ఆ వర్గానికి చెందిన వారెవ్వరికీ మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవడంతో మాదిగల్లో సీఎం కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత వున్నా, ఆయన ఏనాడు దాన్ని పట్టించుకోలేదు. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవాలంటే మాదిగల ఓట్లు రాకపోతే పరాజయం తప్పదు. ఈ నేపథ్యంలోనే 'మాదిగ' సామాజిక వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
దళితులతో చెలిమికి సీఎం కేసీఆర్ తహతహ
సీఎం కేసీఆర్ నాడు డిప్యూటీ సిఎం డాక్టర్ తాటికొండ రాజయ్యను బర్తరఫ్ చేసిన నాటి నుండి ఎంతో మంది దళిత నేతలు సీఎం కేసీఆర్ వైఖరితో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమర్ధులుగా పేరొందిన దళిత ఐఎఎస్, ఐపిఎస్ అధికారులకు ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్‌లు ఇవ్వకుండా అవమానించారు. ఒకానొక దశలో దళిత, గిరిజన ఐఎఎస్ అధికారులు ఛీఫ్ సెక్రటరీకి తమ ఇబ్బందులను ఏకరువు పెట్టారు. అయినా సీఎం కేసీఆర్ తన వైఖరిని మార్చుకోలేదు. మంత్రివర్గ విస్తరణలోనూ రాష్ట్రంలో ఎస్సీ జనాభాలో అధికంగా వున్న మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఈ విషయంలో టిఆర్ఎస్కు, మాదిగ సామాజిక వర్గానికి మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. ఇవేవి సీఎం కేసీఆర్ లక్ష్యపెట్టలేదన్నది తెలిసిందే. ఇప్పుడు కూడా హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే దళిత బంధు పథకం. అంతేకాదు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులును టిఆర్ఎస్లో చేర్చుకొని ఆయన్ను హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రచారం చేయించి ఆ సామాజిక వర్గం ఓట్లను దండుకునే ప్రయత్నం చేయడానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. తాజాగా బిజెపికి రాజీనామా చేసిన 'మోత్కుపల్లి' సీఎం కేసీఆర్‌ను సాక్షాత్తు అంబేద్కర్‌తో పోల్చడం గమనార్హం. 'మోత్కుపల్లి' పొగడ్తలపై దళిత మేధావులు, ప్రజలు నొచ్చుకుంటున్నారు. ఈ విషయంలో పలువురు నేతలు ఇప్పటికే 'మోత్కుపల్లి'పై విమర్శలు చేశారు. ఏదేమైనా హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ దళితులు ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గాన్ని బుజ్జగించే ప్రయత్నం చేయడం ఓట్ల రాజకీయాల్లో భాగమేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.