Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి, ములుగు జిల్లా కలెక్టర్కృష్ణ ఆదిత్య, ఎమ్మెల్యే సీతక్క హర్షం
నవతెలంగాణ-వరంగల్
రామప్ప దేవాలయానికి 2020 సంవత్సరానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా 'యునెస్కో' ప్రకటించింది. వరంగల్ నగరానికి 77 కిలోమీటర్ల దూరంలో పాలంపేటలో 1214లో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి సేనాధిపతి రేచర్ల రుద్రుడు, రామప్ప శిల్పితో ఈ ఆలయాన్ని నిర్మించారు. 40 ఏండ్ల పాటు శ్రమించి అద్భుత కళారీతులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు ఈ పోటీలో రామప్ప దేవాలయంతో పోటీపడ్డాయి. ఈ పోటీలో రామప్ప దేవాలయం గుర్తింపును నార్వే దేశం అడ్డుకునే ప్రయత్నం చేసినా రష్యా మనకు మద్దతు నివ్వడంతో 17 దేశాలు మద్దతుగా నిలిచాయి. దీంతో చైనాదేశంలోని ఫ్యూజో నగరంలో వర్చువల్గా జరిగిన సమావేశంలో రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప దేవాలయం రికార్డు సృష్టించింది. ములుగు జిల్లా పాలంపేటలో రామప్ప అనే శిల్పి నిర్వహణ బాధ్యతలతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ శిల్పా కళా సంపద ప్రపంచాన్ని ఆకర్షించింది. 2019లో యునెస్కో ప్రతినిధులు రామప్ప దేవాలయాన్ని సందర్శించిన విషయం విదితమే. ఇప్పటి వరకు ప్రపంచంలో 167 దేశాల నుండి 1,121 కట్టడాలను వారసత్వ కట్టడాలుగా యునెస్కో ప్రకటించగా రామప్ప దేవాలయాన్ని కూడా 'యునెస్కో' ప్రకటించింది. వరంగల్ నగరానికి 77 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట గ్రామంలో 1213లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి సేనాధిపతి రేచర్ల రుద్రుడు శివుని మీదనున్న అపారమైన భక్తితో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. రామప్ప అనే శిల్పి ఆలయ నిర్మాణ బాధ్యతలు తీసుకొని 40 ఏండ్లు శ్రమించి ఈ దేవాలయాన్ని పూర్తి చేశారు. ఈ దేవాలయంలో రామలింగేశ్వరుడు దేవుడు. ఆలయన గోపురాన్ని తేలియాడే ఇటుకలతో నిర్మించారు. ఆలయ నిర్మాణానికి నల్ల డోలమైట్, శాండ్స్టోన్ను వినియోగించారు. రామప్ప దేవాలయం నిర్మాణానికి వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం, శిల్పా కళా సంపద మరెక్కడ వినియోగించలేదనే చెప్పొచ్చు. ఈ ప్రత్యేకతల దృష్ట్యానే రామప్ప దేవాలయం యునెస్కో దృష్టిలో పడింది. 2019లో యునెస్కో బృందం ప్రతినిధులు రామప్ప దేవాలయాన్ని సందర్శించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే యునెస్కో 2020 సంవత్సరానికి రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది.
శాండ్బాక్స్ టెక్నాలజీతో..
రామప్ప దేవాలయాన్ని 'శాండ్బాక్స్' టెక్నాలజీతో నిర్మించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నల్లరేగడి నేలలు అధికంగా వుండడంతో ఎక్కువ బరువున్న రాతి నిర్మాణాలను ఈ నేలలు మోయడం కష్టం. నేల స్వభావాన్ని దృష్టిలో వుంచుకొని ఈ నిర్మాణాన్ని ప్రత్యేక నిర్మాణరీతులలో నిర్మించారు. ఆధునిక పరిజ్ఞానంలో దేవాలయ నిర్మాణంలో వినియోగించిన టెక్నాలజీని 'శాండ్బాక్స్' టెక్నాలజీగా అభివర్ణిస్తున్నారు. ఆలయ నిర్మాణ స్థలిలో 3 మీటర్లలోతులో పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుక నింపి, ఆ ఇసుక ఎప్పుడూ తడిగా వుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఇసుకపై రాళ్లను పరుచుకుంటూపోయి కక్ష్యా మంటపాన్ని నిర్మించారు. అక్కడి నుండి దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఈ నిర్మాణంలో తేలియాడే ఇటుకలను వినియోగించారు. సాధారణ నిర్మాణంలో 2.2 సాంద్రత కలిగి వుంటాయి. ఈ దేవాలయం నిర్మాణంలో ఇసుకలను 0.8 సాంద్రత కలిగినవి తయారు చేసి వినియోగించారు. ఈ ఇటుకలు తక్కువ బరువుండి నీటిలో తేలుతూ వుంటాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు చెబుతున్నారు.
విశేషంగా ఆకర్షించే మదనికల సొగసులు..
ఆలయానికి నలువైపులా నల్లగ్రానైట్ రాయితో మదనికలను చెక్కిన తీరు వర్ణాణాతీతం. ఆలయం నలువైపులా ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి ఈజిప్టు, మంగోలియన్ యాత్రికుల శిల్పాలు అబ్బురపరుస్తాయి. ఆనాటి శిల్పా కళా వైభవానికి రామప్ప దేవాలయం తార్కాణంగా నిలిచిపోతుంది. దేవాలయంపై చెక్కిన శిల్పాలు సూది బెజ్జం సందులాంటి అతిసూక్ష్మమైన శిల్పాలు ఇక్కడ కొలువుతీరి వున్నాయి. ఆలయం బరువును మోస్తున్నట్లుగా వందలాది ఏనుగుల శిల్పాలను చెక్కారు. ఒక ఏనుగుతో మరో ఏనుగుకు పోలిక లేకుండా విభిన్నంగా ఆకృతులను చెక్కడం వారి శిల్పా కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. శివుడి ఎదురుగా వున్న నందికి విభిన్నమైన ప్రత్యేకత వుంది. నంది శివుడి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నట్లుగా చెవిని లింగం వైపుకు పెట్టి లేవడానికి తయారుగా వున్నట్లు చెక్కిన రామప్ప శిల్పి కళానైపుణ్యం ప్రత్యేకతను చాటుతుంది.
పలువురి హర్షం..
చారిత్రక వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపునివ్వడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం హన్మకొండలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడానికి కృషి చేసిన సీఎం కేసీఆర్కు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రామప్పకు అంతర్జాతీయ ఖ్యాతి రావడానికి పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారని, రామప్ప దేవాలయం విశిష్టతను, అక్కడ శిల్పాల ప్రత్యేకతను వివరించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే ప్రపంచస్థాయిలో యునెస్కో గుర్తింపు రామప్పకు లభించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రలోనే దీనికి యునెస్కో గుర్తింపునకు ప్రయత్నించినా, నాటి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల సాధ్యం కాలేదన్నారు. యునెస్కో గుర్తింపు రావడానికి మిగతా దేశాలతోపాటు రష్యా సంపూర్ణ సహకారాన్ని అందించిందన్నారు. ఈ గుర్తింపు ఉమ్మడి వరంగల్ జిల్లాకు గర్వకారణమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు సాధించిన తొలి కట్టడంగా రామప్ప దేవాలయం నిలిచిందన్నారు. ఈ దేవాలయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. ఈ గుడి అభివృద్ధికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామన్నారు. గుర్తింపు రావడానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలను మంత్రి అభినందించారు. ప్రపంచ వారసత్వ హౌదా రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచి అనేక చర్యలు తీసుకుందన్నారు. విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జన్ను జఖర్యా తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య హర్షం
ములుగు : రామప్ప దేవాలయానికి యునేస్కో గుర్తింపు రావడం ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. రామప్ప విషిష్టత ను ,అక్కడ శిల్పా కళా నైపుణ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడానికి ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కషి ఎంతగానో ఉందని వారందరి పత్యేక అభినందనలు తెలిపారు.
హర్షం వ్యక్తం చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
నాటి కాకతీయుల హయంలో శిల్ప కళను ప్రపంచానికి తెలియ పర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని, తెలంగాణ ఉద్యమ సమయంలో రామప్ప రుద్రేశ్వర ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం కోసం అహర్నిశలు కృషి చేసిన పాండు రంగా రావు, పాపారావు, శ్రీనివాస చార్యులకు ఏళ్ల నిరీక్షణకు యునెస్కో శుభ ముగింపు పలికిందనిములుగు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క అన్నారు. యునెస్కో గుర్తింపు కోసం కృషి చేసిన భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించిన 21 దేశాల ప్రతినిధులకు ములుగు జిల్లా అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శిల్పకళాఖండాలకు నిలయమైన రామప్పకు ప్రపంచ వారసత్వ హౌదా దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో పచ్చని పంట పొలాల నడుమ కొలువైన రామప్ప ఆలయం శిల్పకళా సంపదకు కేంద్రమన్నారు. రోజుల తరబడి చూసినా తనివితీరని అపురూప ఆకృతులకు ఈ ఆలయం పెట్టింది పేరన్నారు. బోటింగ్ సదుపాయం కూడా ఉందని, శతాబ్దాల నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఆలయానికి అపురూప గుర్తింపు లభించిందని హర్షం వ్యక్తం చేశారు
ఖండతరాల్లో ములుగు జిల్లా ఖ్యాతి : జెడ్పీ చైర్మెన్
అంతర్జాతీయ స్థాయిలో రామప్ప శిల్ప సంపద ఖండతరాలను దాటి ములుగు జిల్లా ఖ్యాతి గాంచిందని ఆదివారం జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. నాటి కాకతీయ రాజుల కళా వైభవం ప్రపంచ స్థాయిలో అందరు తెలిసే విధంగా ఒక వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ గుర్తింపు పొందడం కోసం కృషి చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. రామప్ప దేవాలయ ఆవరణలో జడ్పీ చైర్మన్ టీిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు.