Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-భూపాలపల్లి
తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్, టైం స్కేల్లలో పని చేస్తున్న వారందరికీ కీ పీఆర్సీ కమిషన్ సిఫారస్ చేసిన ప్రకారం కనీస వేతనం 19వేల రూపాయలు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మశ్రీ డిమాండ్ చేశారు. ఆదివారం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జిల్లా విస్తృతస్థాయి సమావేశం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించారు. దీనికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వ్యవస్థ లేకుండా అందర్నీ పర్మినెంట్ చేస్తామని చెప్పిన ఆనాటి ఉద్యమనేత సీఎం కేసీఆర్ దానిని అమలు చేయకపోవడం అన్యాయమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలి పీఆర్సీలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వీరికి జీతభత్యాలు కేవలం 30శాతం పెంచడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా పీఆర్పీ సిఫారస్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఆమె కోరారు. మార్చి నుంచి వివిధ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో అయోమయ పరిస్థితుల్లో వీరు పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చి పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని ఆమె కోరారు. ఇలాంటి అనేక సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో ఫెడరేషన్ పనిచేయాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు గాలి శ్రీనివాస్ యాదవ్, ఎండీ రియాజ్, అనిల్, సౌజన్య, వెంకటేశ్వర్లు, రవి, శ్రీనివాస్, సతీష్, విజయ, పుష్పలత, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.