Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మట్టెవాడ
కొవిడ్ సమయంలో ప్రాణాలను ఫణంగాపెట్టి పనిచేసిన స్టాఫ్ నర్సులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. 21రోజులుగా ఉద్యోగం నుంచి తొలగించిన ఎంజీఎం స్టాఫ్ నర్స్‌ల నిరవధిక దీక్షా శిబిరాన్ని ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ కొవిడ్ బాధితుల కోసం పనిచేసిన స్టాఫ్ నర్స్‌లను ఉద్యోగం నుంచి తీసివేయడం సిగ్గుచేటని తక్షణమే వారిని విధుల్లోకి తీసుకుని పూర్తిస్థాయిలో ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యరంగంలో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. వాటిని నింపకుండా పరోక్షంగా ప్రైవేటు ఆస్పత్రులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం తక్షణమే బుద్ధి తెచ్చుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య ఖాళీలను భర్తీ చేయాలని చెప్పారు. లేదంటే దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి, నగర కార్యదర్శి షేక్ బాష్ మియా, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వలీఉల్లాఖాద్రి, ఏఐటీయూసీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు తోట భిక్షపతి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ దండు లక్ష్మణ్, ఏఐటీయూసీ నాయకులు ఓర్సు రాజు తదితరులు పాల్గొన్నారు.