Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 9న క్విట్ ఇండియా స్ఫూర్తితో సేవ్ ఇండియా ఉద్యమం: శోభన్
నవతెలంగాణ-నర్సంపేట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్ అన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి అనంతగిరి రవి అధ్యక్షతన ఆదివారం సమావేశం నిర్వహించారు. దీనికి తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ వరంగల్ రూరల్ జిల్లా కమిటీల నాయకులు శోభన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో రెండో సారి అధికారలంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టడానికి చట్టాలు చేస్తుందన్నారు. దేశ ప్రజలకు అత్యుత్తమ సేవలందిస్తున్న రైల్వే, బ్యాంకింగ్, విమానయానం తదితర ప్రభుత్వ రంగ సంస్థలను, నవరత్న కంపెనీలను కారుచౌకగా అమ్మడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రజలపై భారాలు మోపుతుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ చార్జీలు పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం వేసిందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి పార్లమెంటులో తనకున్న మందబలంతో నల్ల చట్టాలు చేసిందని దుయ్యబట్టారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఎనిమిది నెలలుగా దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న పట్టించుకోకపోవడమే కాకుండా అణిచివేసేందుకు పోలీసులచే నిర్భంధాన్ని విధిస్తుందన్నారు. నూతన కార్మిక చట్టాల వల్ల వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలతో కార్మికులు సాధించుకున్న హక్కులను కార్మిక కోడ్ పేరుతో కార్మిక చట్టాలను సవరించి కార్పొరేట్ శక్తులు తమ లాభాలు తెచ్చిపేట్టేందుకు కార్మిక చట్టాల సవరణ చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, కార్మిక సవరణ చట్టాలను రద్దు పర్చాలని నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1942 ఆగస్టు 9న సాగించిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక, కర్షకుల ఐక్యంగా 'సేవ్ ఇండియా' ఉద్యమంలో పాల్గొనాలన్నారు. ఇందుకోసం గ్రామం నుంచి ప్రజలను చైతన్యం చేసి కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొరబోయిన కుమారస్వామి, రైతు సంఘం జిల్లా నాయకులు ముంజల సాయిలు, ఎస్కే అన్వర్, కే శ్రీనివాస్‌రెడ్డి, పిండి రాములు, సీఐటీయూ నాయకులు గుజ్జుల ఉమా, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.