Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలరోజులైనా తరలిరాని శాఖలు
- కలెక్టరేట్లో ఏ కార్యాలయం
- ఎక్కడ ఉందో తెలియక ఇబ్బందులు
- కలెక్టరేట్ ఎదుట సూచిక బోర్డులు ఏర్పాటు చేయని అధికారులు
నవతెలంగాణ-కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కొరకు, ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనాలు నిర్మించింది. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని 6.73 ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.57కోట్ల అంచనా వ్యయంతో, అధునాతన సాంకేతికతతో సర్వాంగ సుందరంగా నిర్మించారు. జీ ప్లస్ టూ అంతస్తులతో నిర్మించిన ఈ భవనంలో సుమారు 34 శాఖలు ఒకేచోట కొలువుదీరాయి. 50మంది కూర్చునేలా వీడియో కాన్ఫరెన్స్ హాలు, 210 మంది కూర్చునేలా సమావేశ మందిరం నిర్మించారు. 24మందికి సరిపోయేలా మినీ కాన్ఫరెన్స్‌లు ఉన్నాయి. మొదటి అంతస్తులో 13శాఖలతో పాటు మంత్రికి ప్రత్యేక చాంబర్ కేటాయించారు. రెండో అంతస్తులో 15 విభాగాలతో పాటు 31మందికి సరిపోయేలా మినీ సమావేశ మందిరం ఏర్పాటు చేశారు. అయితే నూతన కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చే బాధితులు, ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజలు వారికి సంబంధించిన సమస్యలను తెలిపేందుకు కార్యాలయానికి వస్తారు. అయితే, రెండంతస్తుల కలెక్టరేట్ కార్యాలయంలో ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను అధిగ మించేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో ఏ శాఖ ఎక్కడ ఉందనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా అధికారులు సూచిక బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
నెలరోజులైనా తరలిరాని శాఖలు..
జూన్ 21వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్ భవనం ప్రారంభమైంది. నెల రోజులైనా కలెక్టరేట్ కు సంబంధించి 34శాఖలు ఉండగా ఇందులో కొన్ని శాఖలు మాత్రమే నూతన కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చాయి. ఇంకా కొన్ని శాఖలు అద్దె భవనాల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికైనా అద్దె భవనాల్లో ఉన్న శాఖలను కలెక్టర్ కార్యాలయానికి తరలిస్తే ప్రజలకు సమయం వృథా కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కలెక్టరేట్‌కు రాని శాఖలు ఇవే..
డీఆర్డీఏ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ శాఖలే కాకుండా, లీడ్ బ్యాంకు మేనేజర్, మద్యపాన నిషేధ శాఖలు ఇంకా కొలువుదీరలేదు.
గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్టర్ చాంబర్..
ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్టర్, రెవెన్యూకు సంబంధించిన విభాగాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ చాంబర్, అదనపు కలెక్టర్ చాంబర్, టూరిజం అధికారి. ఐసీడీఎస్, సమావేశ మందిరం, వేచిఉండుగది, మహిళలకు లంచ్ రూమ్, సర్వర్ రూమ్, వీడియో కాన్ఫరెన్స్ రూమ్, స్టాఫ్‌రూమ్, రికార్డు గది, కలెక్టరేట్ ఇన్/ఔట్ వార్డు, రేడియో ఇంజనీరు కార్యాలయం, ఇతర సిబ్బంది గదులు ఉన్నాయి.
మొదటి అంతస్తులో మంత్రి చాంబర్..
జీ ప్లస్ టూ ఉన్న కలెక్టరేట్లో మొదటి అంతస్తులో జిల్లా మంత్రికి చాంబర్‌ను కేటాయించారు. దీంతోపాటు ఖజాన, టీ ఫైబర్, పౌరసరఫరాల శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ, చేనేత, ఉపాధి కల్పనాధికారి, ఆడిట్, మినీ కాన్ఫరెన్స్ హాలు, డీపీఆర్వో శాఖలకు గదులు కేటాయించారు.
రెండో అంతస్తులో సంక్షేమ శాఖలు..
జిల్లా సంక్షేమ శాఖలకు రెండో అంతస్తు కేటాయించారు. డీఆర్డీవో, ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, వ్యవసాయ శాఖ, ఉద్యాన, పట్టుపరిశ్రమ, డీపీవో, ఎల్డీఎం, భూ గర్భజల శాఖ, ఎక్సైజ్, సహకార డీపీవో, గనుల శాఖకు అవసరమైన గదులు కేటాయించారు.