Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఐనవోలు
నాగుర్ల వెంకటేశ్వర్లుకు ఎంమ్మెల్సీ పదవి కేటాయించాలని ఆరె కుల సంక్షమ సంఘం అధ్యక్షులు మేటే శివాజీ అన్నారు. మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆరె కులస్తులు దాదాపు 10 లక్షల పైచిలుకు జనాభ ఉందని, ఇంత జనాభ గల ఆరె కులస్తులకు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రాముఖ్యత ఇవ్వలేదన్నారు. ఇకనైనా ఆరె కులస్తులను దష్టిలో పెట్టుకుని నాగుర్ల వెంకటేశ్వర్లుకు ఎంమ్మెల్సీ పదవి కేటాయించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కోరారు. నాగుర్ల టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. 2005లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మోగుళ్లపల్లి జెడ్పీటీసీగా, జెడ్పీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారన్నారు. 2009 ఎన్నికల సభలో కేసీఆర్ నాగుర్లకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే ఇటీవల నిర్వహించిన వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి ఇస్తానని ఇవ్వలేదన్నారు. ఇకనైనా ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న వెంకటేశ్వర్లుకు ఎమ్మెల్సీ పదవి కేటాయించి ఆరె కులస్తులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కుల సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.