Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్యం ముసుగులో దోపిడీ రాజకీయాలు
- నిరుపేదలను పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
నవ తెలంగాణ-వేలేరు
ప్రజాస్వామ్యం ముసుగులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ రాజకీయాలు చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలంలోని పీచర గ్రామంలో సీపీఐ మండలకార్యదర్శి బట్టు మల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు నిలువ నీడ లేకుండా ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు అప్పచెప్పి సామాన్య ప్రజలు నడ్డి విరుస్తున్నాయని చెప్పారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారని ఎద్దేవాచేశారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కమ్యూనిస్టు ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటం పోరాటం చేసిందని, నేడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక దొరల పాలన గడీల సాగుతోందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత కేసీఆర్ ఎన్నికల్లో హామీలు ఇచ్చి గద్దెనెక్కాడని నేడు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి రాష్ట్రంలో ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను కులాల వారీగా విభజించి పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కారని ఆరోపించారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మూడు ఎకరాల భూమి ఇస్తామని మాయమాటలు చెప్పి రెండోసారి గద్దెనెక్కి నేటి వరకు హామీల ఊసే ఎత్తడం లేదని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా దళితులకు 10లక్షల రూపాయలు ఇస్తామని మాయమాటలు చెప్తున్నాడని ప్రజలు మరోసారి నమ్మి మొసపోవద్దని సూచించారు. రాష్ట్రంలోని దళితులకు డబుల్ బెడ్ రూమ్లు, మూడు ఎకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. మండలంలోని పీచర, కన్నారం గ్రామాల్లోని ప్రభుత్వ భూములను పరిశీలించి భూమిలేని నిరుపేదలకు భూమిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే నిరుపేద దళిత వర్గాలతో భూములను స్వాధీనం చేసుకుని వ్యవసాయం చేసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేదునూరి జ్యోతి, జిల్లా నాయకులు కర్రె భిక్షపతి, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్డీ వలీఉల్లాఖాద్రి, మద్దెల మల్లేష్, తోట భిక్షపతి, గడిపే మల్లేష్, వనేష్, జుర్రు సంపత్, రోహిత్, మునిగాల భిక్షపతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శరత్, ఏఐటీయూసీ నాయకులు భిక్షపతి, గడ్డమీది శంకరయ్య, గంగారపు మైసయ్య, గొర్రె బాబు, దామెర నరేష్, దామెర కరుణ, గడ్డం ఎల్లమ్మ, సవిత, కవిత, రేణుక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.