Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-ములుగు
నాడు ఎన్టీ రామారావు పేదలకు రెండు కిలోల బియ్యం అందిస్తే నేడు కేసీఆర్ ఒకరికి 6 కిలోల చొప్పున అందించి పేద ప్రజలను ఆదుకుంటున్నారని గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లాలో నూతన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు. మంత్రి పాల్గొని రేషన్ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. నాడు ముఖ్యమంత్రిగా ఎన్టి రామారావు పేదలకు రెండు కిలోల బియ్యం ఇస్తే సీఎం కేసీఆర్ అంతకంటే ఎక్కువగా నేడు ఒక్కొకరికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నారని అన్నారు. ములుగు వెనుకబడిన జిల్లా అని, ఇక్కడ వచ్చిన దరఖాస్తుల్లో అర్హులు 2831గా గుర్తించి కార్డులు ఇస్తున్నామని అన్నారు. కొత్త జిల్లాలు వచ్చినా .కొత్త రేషన్ షాపులు రాలేదని, కొత్త రేషన్ షాపులు పెట్టే ప్రతిపాదనలు ఇవ్వాలని, వెంటనే కొత్త రేషన్ షాపులు పెట్టడం కుదరని పక్షంలో డీలర్లు కొత్త గ్రామ పంచాయతీల్లో మూడు రోజులు రేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉపయోగం లేని రేషన్ కార్డులను సరెండర్ చేయాలని కోరారు. ఏ టెక్నాలజీ లేని కాలంలో ఎంతో గొప్పగా రామప్ప ఆలయాన్ని కాకతీయులు 800 ఏళ్ల కిందట నిర్మించారని, దానికి నేడు యునెస్కో గుర్తింపు రావడం గర్వకారణంమన్నారు. ఎక్కడా లేని విధంగా కాకతీయులు పెద్ద పెద్ద చెరువులు తవ్వించి గొప్ప గొప్ప కట్టడాలు కట్టారని అన్నారు. దీనిని నిర్మించిన శిల్పి రామప్ప పేరు మీద గుడి ఉండడం కళా నైపుణ్యానికి నిదర్శనమన్నారు. సీఎం కేసిఆర్ కాకతీయుల కట్టడాలకు గుర్తింపు తెచ్చేందుకు చేసిన కృషి ఫలించిం దన్నారు. స్వయంగా ప్రధాని మోడీ ఇంతటి అద్భుత కళా నైపుణ్యం ఉన్న రామప్పను చూడాలని పిలుపు నివ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. యునెస్కో గుర్తింపుతో దేవాలయం అభివృద్ధి అయితే..దాని పరిసర ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. జిల్లాలోనే గొప్ప మేడారం జాతర జరుగుతుందని, లక్నవరం చెరువు, బొగత జలపాతాలు ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయాన్నఉ. ఈ జిల్లా పర్యాటక ప్రాంతంగా మరింత అభివద్ధి అవుతుందన్నారు. గోదావరి ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణం వారం పది రోజుల్లో టెండర్ వేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలో సాగుకు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. త్వరలో ఇక్కడ ప్రతి ఎకరాకు నీరు అందుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం కోసం రూ.55 లక్షలు మంజూరయ్యాయన్నారు. 53 ఎకరాలు భూమి కేటాయించడం జరిగిందని, వారం పది రోజుల్లో టెండర్లు కూడా పూర్తవుతాయన్నారు. జిల్లా కు మంజూరు అయిన గిరిజన విశ్వ విద్యాలయం కూడా త్వరగా ప్రారంభించే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తెస్తాం అన్నారు. వచ్చే నెల, రెండు నెలల్లో పోడు భూముల సమస్య కూడా పరిష్కారం అవుతుందని ఆశిద్దాం అని వారు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దనాసరి సీతక్క మాట్లాడుతూ ఇది వెనుకబడిన ప్రాంతం. ఎక్కువగా పేదలున్న ప్రాంతం అని అన్నారు. చాలామందికి దరఖాస్తు చేయడం కూడా తెలువదు. కాబట్టి అర్హులందరికీ కార్డులు ఇవ్వడానికి స్పెషల్ డ్రైవ్ పెట్టాలని కోరారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు కూడా ఇవ్వాలని అన్నారు. ఈ రెండు మూడేళ్లలో వచ్చిన లబ్ధిదారులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని అన్నారు. ప్రస్తుతం రేషన్ కార్డు అన్నిటికీ ఆధారం అయినందున అర్హులందరికీ ఇవ్వాలని కోరారు. జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ సీఎం కేసిఆర్ దేశంలో ఎక్కడా అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అమలు చేస్తున్నారు అని అన్నారు. తమసీల్దార్లు, జెడ్పీటీసీలు, బెనిఫిషరీస్ ఉన్నారని, వారు ధరకాస్తులను పరిశీలించి అర్హత మేరకు రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ... ధరకాస్తులను పరిశీలించి అర్హత మేరకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని అన్నారు. డిఆర్ఓ రమాదేవి, అరవింద్ రెడ్డి, వివిధ మండలాల తాసిల్దర్స్ పాల్గొన్నారు.