Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ చౌరస్తా
గ్రేటర్ వరంగల్ పరిధి నాలుగో డివిజన్ పెద్దమ్మగడ్డ జ్యోతిబసు నగర్, జయశంకర్ కాలనీకి వెళ్లే రోడ్డు వర్షం నీరుతో గుంతలు పడి బురదమయం అయిందని వెంటనే సీసీ రోడ్డు నిర్మించాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రోడ్డు నిర్మాణం కోసం గత సంవత్సరం రూ.30లక్షల నిధులు మంజూరు చేసినప్పటికీ ఇంతవరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయకపోవడం వల్ల వర్షం పడినప్పుడు రోడ్డు మీద ఉన్న గుంతలలో నీరు చేరి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. గ్రేటర్ మున్సిపాలిటీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న కాలనీకి రోడ్డు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పట్టణ ప్రగతిలో డివిజన్ల అభివృద్ధికి పాటుపడదాం అని చెప్పిన పాలకులు సమావేశాలు సభలు నిర్వహించి చేతులు దులుపుకున్నారని సీపీఎం ఏరియా కార్యదర్శి గాదె రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలనీకి వెళ్లేందుకు సీసీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు, లేదంటే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్, చందు, శ్రీనివాస్, రాజేందర్, వేణు, అనిల్, చింటూ, రాజు, చిరంజీవి ప్రభాకర్, అశోక్ పాల్గొన్నారు.