Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సంక్షేమాధికారి ఈపి ప్రేమలత
నవతెలంగాణ-ములుగు
మానవ అక్రమ రవాణా నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా సంక్షేమాధికారి ఈపీ ప్రేమలత అన్నారు. శుక్రవారం మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ బరిగెల ప్రణరు కుమార్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రేమలత పాల్గొని మాట్లాడారు. బాలల పరిరక్షణ విభాగాల్లో పని చేస్తున్న లైన్ డిపార్ట్మెంట్స్ సిబ్బంది పిల్లలను రెస్క్యూ చేస్తున్న సందర్భంలో వారు ట్రాఫికింగ్ పరిధిలోకి వస్తున్నారా లేదో ధృవీకరించు కోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ట్రాఫికింగ్ కేసులు గుర్తిస్తే జిల్లా మానవ అక్రమ రవాణా కమిటీ దృష్టికి తీసుకురావాలన్నారు. ములుగు జిల్లా అంతర రాష్ట్ర సరిహద్దులు కలిగి ఉన్నదని, వలస కార్మికులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, ఈ క్రమంలోనే బాలల అక్రమ రవాణా జరిగే ప్రమాదం ఉన్నదని అన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, బాలల సమస్యల విషయాల్లో సహకారం అందిస్తున్నారన్నారు. మానవ అక్రమ రవాణా రహిత జిల్లాగా రూపొందించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ లక్ష్మీ, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్, స్వాతి, ఐసిడిఎస్ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి, ప్రొటెక్షన్ అధికారులు క్రిష్ణవేణి, హరికష్ణ, కౌన్సెలర్ ప్రవీణ్ కుమార్,సోషల్ వర్కర్ ప్రణరు, తదితరులు పాల్గొన్నారు.