Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ ఎంపీపీ కిషన్‌నాయక్
నవతెలంగాణ-బయ్యారం
మండలంలో 35వేల ఎకరాల ప్రభుత్వ భూమిని 60 ఏండ్ల కిందట జీఓను ఆధారంగా చూపుతూ ఫారెస్ట్‌కు బదలాయించి విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని కూడా అవకాశం లేకుండా చేయడం, ఆదివాసీ గిరిజనుల పోడు సాగు భూముల పై సాగుకు అవకాశం లేకుండా ఆటంకాలు కల్పిస్తూ, వారి భూములలో మొక్కలు పెట్టడాన్ని ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ ఎంపీపీ గుగులోత్ కిషన్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో 35 వేల ఎకరాల ప్రభుత్వ భూముని దొడ్డి దారిన ఫారెస్టు శాఖకు బదలాయించి మండల అభివద్ధికి విఘాతం కలిగిస్తున్న చర్యలను నిరసించడం నేరమా అని ధ్వజమెత్తారు. దశాబ్ధాలుగా సాగు చేసుకుం టున్న పోడుభూములకు ఆదివాసీ, గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టా హక్కులు రాకుండా అడ్డుకున్న ఫారెస్టు వారు, ఇప్పుడు సేద్యం చేసుకుంటున్న వారిని అడ్డుకుని ఆ భూముల్లో మొక్కలు నాటడం ప్రశ్నించడమే నేరమై పోయిందని అన్నారు. ఇప్పటికే మండల పరిధి ఏజెన్సీ ప్రాంతమైన కొత్తూరు, పందిపంపుల గ్రామాల ప్రజలపై మహిళలతో సహా అక్రమ కేసులు బనాయించారని అన్నారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సభలు, సమావేశంలో పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని ప్రగల్భాలు పలికిన ప్రజాప్రతినిధులు వారి సమస్యలపై ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. తక్షణమే పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.