Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జయశంకర్ భూపాలపల్లి/పలిమెల
శుక్రవారం జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో హనుమంత్ జెండగేతో కలిసి పలిమెల మండలంలోని దమ్మూరు, సర్వాయిపేట, ముకునూరు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దమ్మురు గ్రామంలో త్రీఫేస్ కరెంటు లేక పోవడం మూలంగా ఇబ్బంది కలుగుతుందని అలాగే పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని గిరిజన గ్రామస్తులు కలెక్టర్‌ను కోరగా స్పందించిన కలెక్టర్ వెంటనే త్రి ఫేస్ కరెంటు వచ్చేలా చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో హనుమంత్ జెండగే ను ఆదేశించారు. అదేవిధంగా 2005 కన్నా ముందు పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులను పరిశీలించి తగు చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ అన్నారు. గిరిజన యువతతో మాట్లాడుతూ ఆన్లైన్ క్లాసులు ఎలా జరుగుతున్నాయి అని తెలుసుకొని, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని అన్నారు. తెలంగాణకు హరితహారంలో ఎవెన్యూ ప్లాంటేషన్ ద్వారా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు చిన్నగా ఉన్నాయని డిఆర్డిఏతో మాట్లాడి పెద్ద మొక్కలు తీసుకొచ్చి రోడ్లకు ఇరువైపులా నాటాలని చెప్పారు. అలాగే సర్వాయిపేట ఆర్ అండ్ బి రోడ్డు గుంతలు పడినందున గ్రామ పంచాయతీ నిధులతో వెంటనే గుంతలను పూడ్చాలని ఎంపీడీవో ప్రకాష్ రెడ్డిని ఆదేశించారు. పలిమెలలో పిహెచ్ సి ఏర్పాటు చేయాలని జెడ్పిటిసి ప్రేమలత, ఎంపీపీ బుచక్కలు కోరగా రేపు శనివారం ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులతో సర్వాయిపేటలో సమావేశం నిర్వహించి త్రాగునీటి సమస్యలు తీర్చాలని అధికారులను ఆదేశించారు. పలిమెలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు పరిశీలిస్తానని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో తాసిల్దార్ శ్రీనివాస్,ఎంపిఓ నాగేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, తాసిల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ శివ, ఇతర అధికారులు పాల్గొన్నారు.