Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు వర్తింప చేయాలి
- పలు గ్రామాల్లో కాంగ్రెస్‌లో చేరికలు
- ఏఐసీసీ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-గూడూరు
రాష్ట్రంలోని పేద దళిత కుటుంబాలన్నిటికీ రూ.40 లక్షలు చొప్పున సాయం అందించి ఆదుకోవాలని ఏఐసీసీ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని జగన్నాయకులగూడెం, బొద్దుగొండ, సురేష్‌నగర్ తండాల గ్రామ పంచాయతీల్లో సీతక్క సమక్షంలో బొద్దుగొండ గ్రామం నుంచి న్యూడెమోక్రసీకి చెందిన మాజీ ఎంపీటీసీ బండ నారాయణ ఆధ్వర్యంలో 20 మంది, సురేష్‌నగర్ తండాలో టీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి సుమారు 80 కుటుంబాలు సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీతక్క వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తొలుత ఆయా గ్రామ పంచాయతీల్లో పార్టీ జెండాలను సీతక్క ఎగరేసి మాట్లాడారు. దళిత, ఇతర అన్ని సామాజిక తరగతులకు చెందిన పేదలందరికీ రూ.40 లక్షలు చొప్పున ఇవ్వాలన్నారు. సీఎం కేసీఆర్ హామీలు గుప్పిస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని మండిపడ్డారు. పోడుభూముల సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పోడుసాగు చేసు కుంటున్న గిరిజన రైతులందరికీ పట్టాలిస్తామని గతంలో ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని ఇప్పటికీ అమలు చేయకపోగా అటవీ శాఖ అధికారులను ఉసిగొల్పుతూ దాడులు చేయిస్తున్నారని, పేద గిరిజన రైతులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 9న ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా మోగిస్తామన్నారు. గిరిజన పోడు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్, ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ వేం వాసుదేవరెడ్డి, జిల్లా నాయకులు నూనావత్ రాధ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నూనావత్ రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి స్వామి, వేం శ్రీనివాస్‌రెడ్డి, కొడిదెల సంజరుకుమార్, బుడెగ సతీష్ గౌడ్, లక్ష్మణ్ నాయక్, రమేష్, పూజారి శంకర్, తదితరులు పాల్గొన్నారు.