Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఎఫ్బీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణ రావు
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
నియోజకవర్గంలోని ఖనిజ సంపదను దోచుకుని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టు పోయిన దోపిడీ దొంగల భరతం పట్టాలని కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఏఐఎఫ్బీ నేత గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని అమ్మ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు. మొదటగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్న గండ్ర సత్యనారాయణ రావును కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు శాలువాతో సన్మానించారు. అనంతరం సత్యనారాయణ రావు మాట్లాడుతూ కార్యకర్తల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో భూపాల పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చింది మొగుళ్లపల్లి మండలమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి గండ్ర రమణా రెడ్డిని రెండుసార్లు గెలిపించి అసెంబ్లీలో ప్రతిపక్ష హౌదాలో కొట్లాడమని పంపిస్తే కుటుంబం ఆస్తులు కాపాడుకోవడానికి ప్యాకేజీకి వ్యాపారాలు పెంచుకోవడానికి టీఆర్ఎస్కు అమ్ముడు పోయాడన్నారు. నమ్ముకున్న పార్టీకి మోసం చేసి కార్యకర్తలను నిలువునా ముంచిన నాయకునికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. గత ఎన్నికల్లో ఓడిన ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తూనే ఉన్నానన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టి రెండవ స్థానంలో నిలపాలని నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. గతంలో రెండుసార్లు మోసపోయానని రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని గతంలో చెప్పినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే ఎలాంటి మోసం జరగదనే విశ్వాసంతో ఉన్నానన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుట్రపన్ని రేవంత్ రెడ్డి పై 58 కేసులు పెట్టినా చంచల్ గూడ జైలులో గడిపిన మడమ తిప్పకుండా పోరాటాలు చేసినఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డేనన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రతి కార్యకర్త ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల పైన గానీ నాయకుల పైన గానీ అరాచకాలు సృష్టించేలా అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలు కష్టపడి పనిచేసి ఎన్నికల్లో తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే పాలేరుగా సేవ చేస్తానన్నారు. నాకు రమణారెడ్డి లాగా వ్యాపారాలు, పెట్రోల్ బంకులు, పత్తి మిల్లులు లేవన్నారు. వేల కొద్ది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని రైతులు ఉండే పట్టాదారుల పేర్లని తీసేసి ముస్లిం సోదరులతో కుమ్మక్కై రైతులను మోసం చేసిన ఏకైక వ్యక్తి రమణారెడ్డేనన్నారు. రమణారెడ్డి కి దమ్ము ధైర్యం ఉంటే భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద వస్తే ఆయన చేసిన అక్రమ దోపిడీ విధానాలను నిరూపిస్తానని సవాల్ విసిరారు. హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ తన పదవికి రాజీనామా చేసి ప్రజల తీర్పు కొరకు ఎన్నికల బరిలో నిలిచినట్లు ఎమ్మెల్యే రమణారెడ్డి నిలవాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో 110 ఎకరాల భూమి లో సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేసి ఫారెస్ట్ అధికారులు జూ పార్కు ఏర్పాటు చేస్తే ఇంతవరకు ఎమ్మెల్యే ప్రారంభించక పోవడంలో అంతర్యం ఏమిటన్నారు. ముస్లిం కాంట్రాక్టర్ పేరుమీద కొన్ని వేల ఎకరాల పట్టా భూమి ఉంటే అతనితో కుమ్మక్కై ప్రజల ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
నేతకాని దళితుల భూమిని కాజేయడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇండిపెండెంట్‌గా సింహం గుర్తు మీద పోటీ చేసి ఓడిన ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరా టాలు చేస్తున్నట్లు వివరించారు. దోపిడి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే విధంగా సిద్ధంగా ఉండాలన్నారు. అరాచక పాలన సాగిస్తున్న అవినీతి నాయకులు ప్రజాగ్రహానికి గురికాక తప్పదున్నారు. త్వరలో భూపాలపల్లిలో నిర్వహించే సభ ఈ రాష్ట్రానికి దిక్సూచి కావాలన్నారు. కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ప్రజల్ని భూపాలపల్లి సభకు తరలించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు సమక్షంలో వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సమావేశంలో జిల్లా యువజన శాఖ అధ్యక్షుడు శ్రీకాంత్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చైతన్య, మండల అధ్యక్షుడు కుమార స్వామి, మధు వంశీ, సురేష్ గౌడ్, లింగా రావు, మల్లారెడ్డి, విజరు, దేవేందర్, శ్రీనివాస్ రెడ్డి వివిధ గ్రామాల గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.