Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామయ్య
నవతెలంగాణ-తొర్రూరు
మున్సిపల్ కార్మికులకు జీఓ నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డివిజన్ కేంద్రంలో యూనియన్ అధ్యక్షుడు ఎం ప్రసాద్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన తొర్రూర్ మున్సిపల్ కార్మికుల నిర్మాణ జనరల్ బాడీ సమావేశానికి రామయ్య హాజరై మాట్లాడారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ కరోనా ఉధృతి సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడి అంతటితో వదిలేశారని విమర్శించారు. కార్మికులకు సరైన వేతనాలివ్వాల్సిన బాధ్యతను పాలకులు విస్మరించారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సి ఉందన్నారు. మున్సిపల్ కార్మికులకు వేతనాల పెంచడంతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 11వ పీఆర్సీ మేరకు బేసిక్ మీద కనీసం 30 శాతం వేతనాలు పెంచకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం యూనియన్ రాష్ట్ర నాయకులు కొత్తపల్లి రవి మాట్లాడుతూ కార్మిక వర్గం ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ ఏరియా నాయకులు పుల్లయ్య, నవీన్, షరీఫ్, వెంకన్న, శేఖర్, నరేందర్, సోమయ్య, భద్రు, సోమక్క, వెంకన్న, రాములు, తదితరులు పాల్గొన్నారు.