Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు, భూపాలపల్లి జిల్లా అధికారులతో సమీక్ష ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్
నవతెలంగాణ-ములుగు
పోక్సో యాక్ట్ కింద నమోదైన కేసుల్లో దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయాలని పోలీసు అధికారులను ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆదేశించారు. ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో భూపాలపల్లి, ములుగు జిల్లాల సబ్ డివిజనల్ పోలీస్ అధికారులతో కేసుల విచారణలో తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. పోలీస్స్టేషన్లలో కానిస్టేబుల్ స్థాయి అధికారికి విచారణ కోసం వచ్చిన దరఖాస్తును అందించి విచారణ చేయనివ్వాలని సూచించారు. అలాగే 5ఎస్ వర్టికల్ సిస్టమ్‌ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. పిటీ కేసుల్లో త్వరగా నిందితులపై చార్జిషీట్లు కోర్టుల్లో సమర్పించాలనీ, అన్ని యాక్సిడెంట్ కేసుల్లో ఫామ్-54ను ఖచ్చితంగా కోర్టుకు అందజేయాలని చెప్పారు. ఆస్తి సంబంధిత నేరాలలో నిందితులను పట్టుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి శనివారం పోలీస్స్టేషన్లలో ఎస్హెచ్ఓలు సిబ్బందితో సమావేశమై పోలీస్స్టేషన్ల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌లోని కంప్యూటర్లు చెడిపోతే ఐటీ కోర్ సాయం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు శ్రీనివాసులు, పోతరాజు సాయి చైతన్య, గౌస్ ఆలం, చెన్నూరి రూపేష్, డీఎస్పీలు సంపత్‌కుమార్, బోనాల కిషన్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై చైతన్య చందర్ పాల్గొన్నారు.