Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-సుబేదారి
అనాథ బాలల బంగారు భవిష్యత్‌కు కృషి చేస్తానని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు మంగళవారం రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలో అనాథ పిల్లల జీవన ప్రమాణాలు మెరుగుపరచి, వారి భవిష్యత్తుకు భద్రత కల్పించే గొప్ప లక్ష్యంతో సీఎం కేసిఆర్ ముందుకు వెళుతున్నారని చెప్పారు. దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ అధ్యక్షతన నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులైన వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, రాష్ట్ర జల వనరుల శాఖ చైర్మన్ ప్రకాష్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మేయర్ గుండు సుధారాణితో కలిసి సుబేదారిలోని బాలసదనాన్ని సందర్శించి, పిల్లల బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. అందులో ఉన్న 52 మంది పిల్లలతో కలిసి మంత్రులు, కలెక్టర్, మేయర్ అల్పాహారం చేసి వారితో ముచ్చటించారు. ఇక్కడ ఆహారం ఎలా పెడుతున్నారు, ఇంకా ఏమి కావాలి అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడి వసతుల ఏర్పాట్ల గురించి సమీక్షించారు. సీఎం కేసిఆర్ ఆలోచన మేరకు ఇంకా ఎలాంటి చర్యలు చేపడితే అనాథ పిల్లల జీవితాలు బాగు పండుతాయని అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి వెంటనే నివేదిక ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే అనాథలకు సంపూర్ణ సంరక్షణ బాధ్యతలు తీసుకొని, వారి భవిష్యత్‌కు భద్రత కల్పించాలని, ఆడపిల్లలకు పెళ్లి కూడా చేయాలని ఇటీవలి కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు మంత్రులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ సీఎం కేసిఆర్ దష్టికి అనాథ పిల్లల గురించి కొన్ని సంఘటనలు వచ్చాయన్నారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేసి, వారి పెళ్లిళ్లు కూడా మనమే చేయాలనీ సీఎం కేసిఆర్ అన్నారని తెలిపారు. అనంతరం సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో కరోనా వల్ల అనాథలైన పిల్లలని ఆదుకోవాలని సీఎం కేసిఆర్ చెప్పారన్నారు. 12 మంది మంత్రులతో కలిపి కమిటీ వేశారని తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అనాథలకు మంచి భవిష్యత్ ఉండనుందని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం బాలికా సదనంలో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు విద్యావైద్య సౌకర్యాలు కల్పిస్తూ మానసిక వికాసం, సృజనాత్మకతను పెంపొందించుకొనుటకు వారిని వినోదం, విజ్ఞాన, విహార యాత్రలు, వీకెండ్ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత మంత్రుల వెంట ఉన్నారు. అనంతరం మంత్రులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో 59వ డివిజన్ కార్పొరేటర్ వసంత మహేందర్ రెడ్డి, ఆర్డీవో వాసుచంద్ర, హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అన్నమనేనీ అనిల్ చందర్ రావు, సభ్యులు దామోదర్, సుధాకర్, ఆర్జేడీ ఝాన్సీ లక్ష్మీబాయి, అర్బన్, రూరల్ జిల్లాల సంక్షేమ అధికారులు సబిత, శారద, తహసీల్దార్ గనిపాక రాజు, బాలికా సదనం సూపరింటెండెంట్ వెరోనిక, డీసీపీవోలు సంతోష్ కుమార్, మహేందర్ రెడ్డి, ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.