Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఏకశిలా' గుర్తింపును రద్దు చేయాలి
- విద్యార్థి సంఘాలు రాస్తారోకో
నవతెలంగాణ-మహబూబాబాద్
ప్రయివేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూలును నియంత్రించాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శులు సాయికుమార్, శ్రావణ్, దేవేందర్ ప్రభుత్వాన్ని, జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల పేరుతో వేధిస్తున్న జిల్లా కేంద్రంలోని చౌరస్తా ఏకశిలా విద్యాసంస్థ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయా విద్యార్థి సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికుమార్, శ్రావణ్, దేవేందర్ మాట్లాడారు. ఏకశిలా విద్యా సంస్థ యాజమాన్యం ఆన్లైన్ క్లాసుల పేరుతో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసిందన్నారు. టీసీ, ఇతర సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈఓ సోమశేఖర శర్మ ప్రయివేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించి ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన జీఓ నెంబర్ 46ను తుంగలో తొక్కి కరోనా కష్టకాలంలోనూ విద్యార్థులను, తల్లిదండ్రులను ఫీజుల పేరుతో మానసిక వేధింపులకు గురి చేస్తున్న ఏకశిలా విద్యాసంస్థల యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏకశిలా విద్యాసంస్థల చైర్మెన్ తిరుపతిరెడ్డి వేధింపుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులను కాపాడడంలో ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భిక్షాటన చేసి చెల్లిస్తామని హెచ్చరించారు. తద్వారా పాఠశాల యాజమాన్య తీరును, ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి తగిన రీతిలో గుణపాఠం చెబుతామన్నారు. ఆందోళనలో విద్యార్థి సంఘాల నాయకులు సూర్యప్రకాష్, యువరాజ్, వికాస్, ద్రావిడ్, మహేష్, చరణ్, దీక్షిత్, సంజరు, నవనీత్, రాజేష్, ఉమేష్, తదితరులు పాల్గొన్నారు.