Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల హైఅలర్ట్
- ముమ్మరంగా వాహనాల తనిఖీ
- గొత్తికోయగూడెంలో కార్డెన్ సెర్స్
నవతెలంగాణ-తాడ్వాయి
ఏజెన్సీలో మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలోని తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపూర్ మండలాల్లో జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్, ములుగు ఏఎస్పీ సాయి చైతన్య ఆదేశాల మేరకు పస్రా సీఐ అనుముల శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్రావు, పీఎస్సై అరుణ్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం తనిఖీలు ముమ్మరం చేశారు. ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో విప్లవ పార్టీల ఉనికి ఉన్న మండలాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలతో నిరంతరం కూంబింగ్ చేస్తుండగా మైదాన ప్రాంతం గ్రామాల్లో పోలీసులు వాహనాల తనిఖీలు, గుత్తికోయగూడెంలో కార్డెన్ సెర్చ్‌లు ముమ్మరం చేశారు. కాటాపూర్ క్రాస్ రోడ్డు, తాడ్వాయి హట్స్, మేడారం ప్రధాన రహదారి 163 జాతీయ రహదారి పొడవున మోరీలు, వంతెనల వద్ద ముమ్మర తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు కొరియర్లు, సానుభూతిపరులుగా ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా పెంచి ఆరా తీస్తున్నారు. చత్తీస్ఘడ్ నుండి వలస వచ్చి ఏజెన్సీ అడవుల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న గుత్తికోయ గూడాలలో నిత్యం కార్డన్ సెర్చ్ పేరిట హడావుడి చేస్తూ వారి ఆధార్, రేషన్ కార్డులను స్వాధీనం చేసుకొని ఫొటోలను కూడా సేకరిస్తున్నారు. మరో పక్క మావోయిస్టులు వారోత్సవాలను గ్రామ, గ్రామాన ఘనంగా నిర్వహించాలంటూ ఏజెన్సీలో పిలుపునివ్వడంతో ఇంటలిజన్స్ అధికారులు అప్రమత్తమై పొోలీసులను అలర్ట్ చేశారు. తాజా సమాచారాన్ని పోలీసులకు అందజేస్తూ అప్రమత్తం చేశారు. వారోత్సవాల తరుణంలో సబ్ డివిజన్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న మావోయిస్టు, పోలీసుల వైరం ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కార్యాల యాలు, ఆస్థులపై మావోయిస్టులు విరుచుకుపడి దహనకాండకు పాల్పడవచ్చనే సమాచారం మేరకు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాత్రిపూట పెట్రోలింగ్‌తోపాటు గస్తీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులు గట్టి భద్రత చర్యలు తీసుకున్నారు. తాడ్వాయి ఏటూరునాగారం ప్రధాన జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రతినిత్యం గుత్తికోయగూడెల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తూ అడవులను జల్లెడ పట్టారు. తాడ్వాయి సరిహద్దు మండలం కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిలాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నైట్ హాల్ట్ చేసే ఆర్టీసీ బస్సులను రాత్రివేళల్లో తప్పకుండా పోలీస్ స్టేషన్లో వచ్చి బస్సులను నిలుపుకోవాలని ఆదేశించారు. ఏజెన్సీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రత మధ్య కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మావోయిస్టు వారోత్సవాలను భగం చేసేందుకు పోలీసులు, నిర్వహించేందుకు మావోయిస్టులు పోటీలు పడుతుండటంతో ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణం వేడెక్కింది. ఏదిఏమైనా ఏజెన్సీలో అవాంఛనీయ సంఘటనలు జరగనందుకు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.