Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వేశ్వర్రావు
నవతెలంగాణ-తొర్రూరు
వ్యవసాయ రంగం నుంచి కార్పోరేట్ సంస్థలను వైదొలగాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తమ్మెర విశ్వేశ్వర్రావు, సీపీఐ(ఎం) నాయకుడు వై వెంకటయ్య డిమాండ్ చేశారు. 'వ్యవసాయ రంగం నుంచి కార్పోరేట్ సంస్థలను తరిమికొట్టండి' అంశంపై మీద తొర్రూర్ డివిజన్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి సంఘం జిల్లా బాధ్యుడు నల్లు సుధాకర్‌రెడ్డి అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు విశ్వేశ్వర్రావు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. దేశంలో 65 శాతం మందికిపైగా ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తుండగా ఆ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం కోసం 3 రైతు వ్యతిరేక చట్టాలని తీసుకొచ్చారని విమర్శించారు. సదరు చట్టాల రద్దు కోసం 150 రోజులకుపైగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు రిలే దీక్షలు, నిరసనలు తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. వ్యవసాయ రంగం నుంచి చిన్న, సన్నకారు రైతులను దూరం చేసేలా, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేలా కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలు అమలు చేస్తోందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, తదితర నిత్యావసరాల ధరలను ఇష్టారీతిన పెంచుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే రిలయన్స్ సంస్థకు పంజాబ్‌లో రెండు వేల ఎకరాలకుపైగా భూమిని కట్టబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటు శక్తులను వ్యవసాయ రంగం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పీఏసీఎస్ చైర్మెన్ కాకిరాల హరిప్రసాద్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, సీపీఐ(ఎం) నాయకుడు వై వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెవిటి సధాకర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచేలా తప్పుడు విధానాలు అవలంభిస్తోందని తెలిపారు. ఈనెల 9న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో తలపెట్టిన సేవ్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బొల్లం అశోక్, సీపీఐ మండల కార్యదర్శి గట్టు శ్రీమన్నారాయణ, గిరిజన సంఘం నాయకులు అజ్మీర వీరన్న, లచ్చిరాం, విద్యార్థి సంఘం నాయకుడు బందు మహేందర్, సీపీఐ నాయకుడు గణపురం లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.