Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
దళిత మహిళలకు దేశంలో రక్షణ ఏదని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండల కేంద్రంలో ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా ఇంచార్జ్ చర్ప రవి అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో అరుణ్ కుమార్ మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో దళిత, ఆదివాసీ మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోయాయని ఆందోళన వెలిబుచ్చారు. వాటిని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉందన్నారు. 74 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో నానాటికీ దళితులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలో స్త్రీ అర్ధరాత్రి నడిరోడ్డుపై స్వేచ్చగా తిరగ గలిగిన రోజు నిజమైన స్వతంత్రం వచ్చినట్టని మహాత్మా గాంధీ అన్నారని గుర్తు చుఏశారు. కాగా దళిత మహిళలు ప్రభుత్వ కార్యాలయాల్లో, ఉన్నత ఉద్యోగాల్లో కూడా భద్రతతో ఉద్యోగం చేయలేని దౌర్భాగ్యం నెలకొందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న తప్పుడు విధానాలే ఇందుకు కారణమని స్పష్టం చేశారు. మనిషి మనిషిలా కాకుండా, ప్రజాస్వామ్య సమానత్వ విధానాలను పాటించకుండా, కుల వివక్షతతో ప్రభుత్వ పరిపాలనకు అంకురార్పణ చేసినంత కాలం ప్రజాస్వామ్య పరిపాలనలో మార్పు రాదన్నారు. సమానత్వాన్ని పాతర పెట్టి అగ్ర, దళిత కులాలుగా విభజిస్తూ సామాజిక మాధ్యమాలు, సినిమాల్లో రెచ్చగొట్టేలా కార్యక్రమాలు ప్రసారం చేయడమే ఇందుకు కారణమన్నారు. అంబేద్కర్ కాలం నుంచి మహబాబూబాద్లో ట్రెయినీ ఎస్సైపై దాడి వరకు ప్రభుత్వ శాఖల్లో దళితులపై అణచివేత, కుల దురహంకారం చర్యలు కొనసాగింపుగానే వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి సంఘటనలు బయటికి రానివి అనేకమున్నాయని చెప్పారు. ఇంకెంత కాలం ఇలాంటివి సహిద్దామని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలు అవక పోవడం మూలంగా ఇలాంటి సంఘటనలు పునరావతం అవుతున్నాయని అన్నారు. వెంటనే లైంగిక దాడికి పాల్పడిన ఎస్సైని సర్వీస్ నుంచి తొలగించాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళిత మహిళల రక్షణ పట్ల పాలకులు అవలంభిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉద్యమాలు చేపడతామని చెప్పారు. అంబేద్కర్ వారసులుగా దళితులకు ఆదివాసీల మద్దతు పూర్తిగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి కొర్నెబెల్లి గణేష్, జిల్లా నాయకులు పాయం పూర్ణచందర్, తదితరులు పాల్గొన్నారు.