Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్దియాలో విమర్శల వెల్లువ
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లను (ఆర్ఐ) బదిలీ చేసినట్టు తెలుస్తోంది. విధుల్లో చేరిన 10 నెలలు సైతం గడవకముందే కొందరు ఆర్ఐలను బదిలీ చేయడంపై బల్దియా ప్రధాన కార్యాలయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీడబ్ల్యూఎంసీ పరిధిలో మొత్తం 11 మంది ఆర్ఐలుండగా అందులో ఏడుగురిని బదిలీ చేశారు. సీ వన్ సెక్షన్లో బదిలీ చేయడానికి ఫైల్ నంబర్ వేశారా? అదనపు కమిషనర్‌కు తెలియకుండా ఆర్ఐల బదిలీలు జరిగినట్టు సమాచారం. కొందరు పెద్దలు మేయర్, ఇన్‌ఛార్జి కమిషనర్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ సర్కిల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ బదిలీ అయి 4 నెలలు కూడా గడవక ముందే మరో సర్కిల్‌కు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా బదిలీ చేయడం పలు అనుమానాలకు తెరతీసింది. కొందరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లను బదిలీ అయి 10 నెలలు కూడా గడవక ముందే మళ్లీ వేరే సర్కిల్‌కు బదిలీ చేయడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలా పలుమార్లు బదిలీలు చేయడం వల్ల ఫైళ్లు పెండింగ్‌లో ఉండే అవకాశాలెక్కువన్న విషయం ఉన్నతాధికారులకు సైతం తెలిసిందే. బదిలీ అయిన ఆర్ఐకి సదరు సర్కిల్ మీద అవగాహన వచ్చిన అనంతరం మరొక ప్రాంతానికి బదిలీ చేయడం వల్ల సమస్యాత్మక భూములను గుర్తించడంలో జాప్యం జరిగే అవకాశముంది. అలాగే ఫైళ్లూ పెండింగ్‌లో ఉండే పరిస్థితి ఉంటుంది. ఇంటి పన్ను వసూళ్లలోనూ సమస్యలు తల్తెతడం సహజం. ఇన్ని సమస్యలున్నప్పటికీ ఆర్ఐల బదిలీల వెనుక ఉన్న కారణాలేంటన్నది వెలుగులోకి రాకపోయినప్పటికీ సమస్య ఎంత వరకు వెళ్తుందనేది వేచి చూడాల్సిందే.
రూ.2 లక్షలు చొప్పున వసూళ్లు..?
ఐదుగురు ఆర్ఐల నుంచి రూ.2 లక్షలు చొప్పున వసూళ్లకు పాల్పడి బదిలీలు చేసినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఆర్ఐలను వేరే సెక్షన్లకు బదిలీ చేసి వారి స్థానాల్లో నలుగురు ఆర్ఐలను కొత్తగా విధుల్లోకి తీసుకుంటారన్న ప్రచారం సాగుతోంది.