Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ ఘనపూర్
సివిల్ సప్లై కార్పొరేషన్ గోడౌన్లలో పనిచేస్తున్న హమాలి కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ అనుబంధ సంఘం అధ్యక్షుడు తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం విలేకరులతో మాట్లాడారు. 40 ఏండ్లుగా నామమాత్రపు వేతనాలతో పూట గడవని దుస్థితిలో, కుటుంబాలను పోషించుకుంటూ గ్రామీణ ప్రాంత పౌర సరఫరాల దుకాణాలకు బియ్యం పంపిణీలో ఎగుమతి, దిగుమతి చేస్తూ ప్రజాపంపిణీ పరిరక్షణ కోసం పాటు పడుతున్న హమాలీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ రక్షణానిమిత్తం కనీసం మాస్కులు కూడా ఇవ్వకపోవడంతో, చేతి రుమాళ్ళు చుట్టుకొని కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటూ పని చేశామని గుర్తు చేశారు. ఇదిలావుండగా ప్రమాదవశాత్తు మరణించిన హమాలీ కార్మికుల కుటుంబాలకు తక్షణమే 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.ప్రతీ కార్మికుడికి ఉచితంగా ప్రతినెల 50 కిలోల బియ్యంతో పాటు 7500 రూపాయలు అందించాలని కరోనా సాయంగా ప్రకటించాలని, ఇండ్లు లేనివారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికులంతా ఏకమై ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బిక్షపతి, రమేష్, యాదగిరి, శంకర్, రమేష్, పరమేష్, అశోక్, రాజకుమార్, ఇతరులు పాల్గొన్నారు.