Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి, భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-శాయంపేట
చారిత్రక చరిత్ర కలిగిన భూపాలపల్లి జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి, భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ లకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఢిల్లీలోని కేంద్ర సాంస్కతిక, పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ విద్యావతిని శుక్రవారం వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్‌తో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన భూపాలపల్లి జిల్లా అభివద్ధి పథంలో ముందు వరుసలో ఉన్నదని, ఈ జిల్లా చరిత్ర పూర్వం నివాస స్థలాలకు నిలయంగా భాసిల్లుతున్నట్లు తెలిపారు. ఈ జిల్లాలో అపార మైన బొగ్గు గనులు, కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్, చిట్యాల మండలం నైన్‌పాకలో గులాబీ రాతి శిల మీద నిర్మించిన నాపాక సర్వతోభద్ర దేవాలయం, గణపురం మండలం లోని కోటగుళ్ళు, గణపేశ్వర స్వామి ఆలయం, రేగొండ మండలం లోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం, సున్నపురాయితో అవక్షేప శిలలతో ఎత్తయిన బండరాళ్లతో ఆహ్లాదకరంగా పర్వత అధిరోహణకు అనువైన ప్రాంతం పాండవులగుట్ట అని తెలిపారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం, దక్షిణ త్రివేణి సంగమం, గోదావరి నదిపై నిర్మించిన అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, అడవులు కలిగిన ప్రాంతం భూపాలపల్లి జిల్లా అని తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, అందుకు కావాల్సిన ఆదేశాలను జారీ చేస్తూ నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే అధికారులను భూపాలపల్లి జిల్లా కు పంపించి సమగ్ర నివేదిక తీసుకొని పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చేయడం కోసం కావలసిన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. కేంద్ర మంత్రికి, పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్‌కి కృతజ్ఞతలు తెలియ జేశారు.