Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్, బీజేపీ నడుమ రగడ
నవతెలంగాణ-వరంగల్
హుజురాబాద్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని వస్తున్న వార్తల నేపథ్యంలో నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నడుమ రాజకీయాలు అనుక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. కమలాపూర్ మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్న కార్యక్రమంలో ఎంపీపీ తడక రాణిని వేదిక మీదకు పిలవకపోవడం, మాట్లాడనీయకుండా అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. సాక్షాత్తు మంత్రి సమక్షంలోనే ప్రోటోకాల్ ఉల్లంఘన జరగడం బిజెపి శ్రేణులకు మరో అస్త్రాన్ని అందించింది. దీంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసనకు బిజెపి శ్రేణులు దిగాయి. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే పోలీసులు అడ్డుకునే క్రమంలో బిజెపి నేతలతో తోపులాట జరిగింది. దీంతో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సతీమణి జమున స్పృహ తప్పి పడిపోవడం ఉద్రిక్తత నెలకొంది.
హుజురాబాద్ ఉపఎన్నికల రాజకీయాలు అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య అనుక్షణం ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. కమలాపూర్ మండల కేంద్రంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో కమలాపూర్ ఎంపీపీ తడక రాణిని వేదిక మీదకు పిలవకపోవడం, ఆమె మాట్లాడే ప్రయత్నం చేస్తే అడ్డుకోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని రోజులుగా ఈ నియోజకవర్గంలో మహిళలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన వ్యాఖ్యలు, తాజాగా మహిళా ఎంపీపీ పట్ల ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం అధికార టీఆర్ఎస్ను ఇరుకునపెట్టింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇటీవల కమలాపూర్ మహిళా ఎంపీడీఓ పట్ల చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి. ఈ క్రమంలో మహిళల పట్ల అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు చులకన భావం వుందన్న సంకేతాలు వెళ్లడం అధికార టిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.
ఇబ్బందికరంగా అధికార టీఆర్ఎస్ నేతల చేష్టలు
ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ డైరెక్షన్లో హుజురాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను ఓడించడానికి పెద్ద
మంత్రి సమక్షంలో ప్రొటోకాల్ ఉల్లంఘన
ఎత్తున మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను రంగంలోకి దించడం అధికార టీఆర్ఎస్కు లాభం చేకూర్చడమేమోకాని, నష్టం కలిగిస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు బీజేపీకి మంచి అస్త్రాలనందించడంతో ప్రజల్లో అధికార టిఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కమలాపూర్ మండల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండలంలో పలు గ్రామాల్లో చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకుపోవడం ద్వారా మహిళల పట్ల అధికార టిఆర్‌ఎస్‌కున్న చులకన భావాన్ని తెలియచేస్తూ టిఆర్ఎస్ను ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది.
బీజేపీ దూకుడు
అధికార టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు, వారి ప్రవర్తను విమర్శనాస్త్రాలుగా మలుచుకొని బిజెపి ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో టిఆర్ఎస్ను ఎండగడుతుంది. నియోజకవర్గంలో ఈ రెండు పార్టీల మధ్య నిత్యం వ్యూహ, ప్రతివ్యూహాలు అనుక్షణం మారుతుండడంతో రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. అధికార టిఆర్ఎస్ చేసిన ప్రతి తప్పును అందిపుచ్చుకొని ప్రజల్లో దూసుకుపోవడానికి 'ఈటల' ప్రయత్నిస్తున్నారు. అధికార టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ప్రవర్తన, వ్యాఖ్యలతో పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రచారంతో లాభమేమో గాని నష్టం అధికమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కమలాపూర్ ఎంపిపి తడకల రాణిని కనీసం గౌరవించకపోవడం, మంత్రే ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడాన్ని బిజెపి ఇదే అదునుగా చర్చనీయాంశంగా చేసింది. ఇందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించుకొని కమలాపూర్ మండలకేంద్రంలో మంత్రి దయాకర్‌రావు వైఖరిని ఎండగట్టారు. ఈ వ్యాఖ్యలు, సంఘటనలు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఏదేమైనా మరికొద్ది రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.