Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగోన్నతుల, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలి
- యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య
నవతెలంగాణ-హన్మకొండ
హెడ్మాస్టర్ పోస్టులను మల్టీ జోనల్ కేడర్లకు మార్చడంతోపాటు ఉద్యోగోన్నతుల, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కే జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. హన్మకొండలోని ఆ సంఘం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఫెడరేషన్ వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కమిటీ సమావేశానికిలాయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల పోస్టులను మల్టీ జోనల్ కేడర్లకు మార్చాల్సి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కోవిడ్ నిబంధనల అమలుకు సిబ్బందిని నిధులను కేటాయించి పాఠశాలలను ప్రత్యక్ష తరగతులకు సిద్ధం చేయాలని కోరారు. కేజీబీవీ పాఠశాలల ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ వర్తింపచేయాలని, కనీస వేతనాన్ని మంజూరు చేయాలన్నారు. అనంతరం ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ మాట్లాడారు. ఉపాధ్యాయుల రేషనలైజేషన్ పేరుతో పాఠశాలల మూసివేత తగదన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఫెడరేషన్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రవీందర్ రాజు, ప్రధాన కార్యదర్శి బద్దం వెంకట్రెడ్డి, రూరల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెండెం రాజు, రఘుపతిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సదాశివరెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాస్, లింగారావు, తదితరులు పాల్గొన్నారు.