Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
ఆదివాసీ ప్రజలను ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లుగా చెప్పవచ్చు. ఆదివాసీలు సమిష్టి జీవన పద్ధతులు, జీవనం, పారదర్శకతకు నిలువెత్తు సాక్ష్యం. ప్రపంచంలో సుమారు ఏడు వేల భాషలుండగా అందులో ఆదివాసీ తెగలు మాట్లాడే భాషలే నాలుగు వేలు కావడం గమనార్హం. నేడు అత్యధికులు మాట్లాడే, వాడే ఆరు భాషలు (ఇంగ్లీషుతో సహా) గతంలో అంతరించిపోయిన ఆదివాసీ తెగలు వాడినవే. బతుకు పోరాటంలో ఆరితేరిన వీరులుగా చరిత్రలో ఆదివాసీలు నిలిచిన విషయం తెలిసిందే. ఆదివాసీలు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో కళకళలాడుతుండేవి. నేడు ఆ వనరులు దోపిడీకి గురౌతున్నాయి. దేశంలో ఇప్పటికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వాలు నిర్వహించని దుస్థితి నెలకొంది. ఎన్జీఓలు చేపట్టే కార్యకలాపాలకు కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆర్థిక తోడ్పాటును మాత్రమే అందిస్తున్నాయి. భారత్‌లో సుమారు 600 ఆదివాసీ తెగలు గుర్తించబడ్డాయి. భారత రాజ్యాంగం ఆదివాసీలకు చట్టపరమైన రక్షణ కల్పించింది. 5వ, 6వ షెడ్యూల్‌గా ప్రాంతీయ, పరిమిత స్వయం పాలనా హక్కు ఇచ్చింది. ఆచరణకు వీలుగా పీసా చట్టం (పీఈఎస్ఏ-1996) వచ్చింది. అయినా బూర్జువా పాలకులు దేశంలోని గిరిజన తెగలకు స్వయం పాలనా హక్కులు నేటికీ కల్పించలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 ఏండ్లు గడచినా ఆదివాసీ తెగలు సంప్రదాయపు భూముల నుంచి, అటవీ ప్రాంతం నుంచి నెట్టివేయబడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో 1/70 చట్టం అమల్లో ఉన్నప్పటికీ షెడ్యూల్డ్ ప్రాంతంలో 48 శాతం సంప్రదాయక గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించు కున్నారు. గిరిజన విద్య పేరుతో ప్రయివేట్, కార్పొరేట్ సంస్థలకు ఐటీడీఏలు దోచిపెడు తున్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతంలో జీఓ 3 ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను స్థానిక గిరిజన అభ్యర్థులతో నింపాల్సి ఉంది. వివిధ కార్యాలయాల్లో నేటికీ స్థానిక అభ్యర్థులు 10 శాతం కూడా పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం జీఓ నెంబర్ 3ను పటిష్టంగా అమలు చేసి స్థానిక గిరిజన అభ్యర్థులకే ఉద్యోగం ఇవ్వాలనే డిమాండ్ ముందుకొస్తోంది. ఆదివాసీ ప్రాంతాల్లోకి టూరిజం ప్రవేశించాక ఆదివాసీ కళలు వ్యాపార సరుకులైపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. నేటి ఉత్సవాలు పాలకవర్గాల అవసరాల కోసమే తప్ప ఆదివాసీలను కాపాడడానికి కాదన్న విమర్శలున్నాయి. నిజమైన ఆదివాసీ దినోత్సవం, ఆదివాసుల 'అవసరాలు-ఆకాంక్షలు' నెరవేర్చేవిగా ఉండాలి. తెలంగాణ ఆదివాసీలకు ఏమీ చేయలేదన్న అపవాదు మూటగట్టుకుంది. పైగా ప్రస్తుత స్థితి నుంచి మరింతగా వారిని దిగజార్చేలా తప్పుడు విధానాలను పాలకులు అవలంభిస్తున్నారు. ఈ స్థితి మారడానికి పోరాటం తప్ప మరో దారిలేదన్న అవగాహన ఆదివాసీల్లో కనపడుతోంది. ఆదివాసీలు స్వరాష్ట్ర సాధన పోరాటంలో చురుకుగా పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఆనాడు చెప్పిన మేథావులతో సహా మైదాన ప్రాంతాల్లోని ఆదివాసీతర సమాజం, ప్రజాస్వామిక వాదులు స్పందించాల్సిన అవసరం ఉంది