Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు
నవతెలంగాణ-మహబూబాబాద్
తెలంగాణ సమాజంలో సగానికిపైగా ఉన్న బీసీల కోసం బీసీ బంధు ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పూలే జంక్షన్లో జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట ఆదివారం నిరసనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడారు. ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర భారతంలో బీసీలకు అన్ని రంగాల్లోనూ తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఎన్ని పోరాటాలు చేసినా పాలకులు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తూ అనుక్షణం బీసీ కులాల మధ్య చిచ్చు పెడుతూ వారిని సంఘటితం కాకుండా వారి ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందక, వ్యాపారం చేసుకుందామంటే డబ్బుల్లేక బీసీ యువత తీవ్ర నిరాశ నిస్పహలకులోనై ఆత్మహత్యలకు పాల్బడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న 54 శాతం బీసీల్లోని పేదలకు బీసీ బంధు వర్తింపజేసి రూ.20 లక్షలు చొప్పున సబ్సిడీ రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నలమాస విక్రంగౌడ్, అయోధ్య మాజీ సర్పంచ్ దుండి శ్రీనివాస్చ గండ్రాతి మల్లేష్, ప్రేంసాగర్, రామరాజు, తోట సురేష్ పటేల్, పింగళి సోమేశ్వర్, కృష్ణ, అందె భాస్కర్, పూజరి శ్రీనివాస్, చిట్టిమల్ల శ్రీమన్, జనగం సాయి, తదితరులు పాల్గొన్నారు.