Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కేంద్రంలోని మోడీ సర్కార్ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను వీడకపోతే ప్రజాక్షేత్రంలో పతనం తప్పదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చింతమల్ల రంగయ్య హెచ్చరించారు. సోమవారం ఆర్అండ్బీ గెస్టు హౌజ్ ఎదుట రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయు ఆధ్వర్యంలో సేవ్ ఇండియా నిరసన కార్యక్రమంలో రంగయ్య మాట్లాడారు. గడిచిన యేడేండ్లలో ప్రధాని మోడీ ప్రభుత్వం రైతులకు, కార్మికులకు, కూలీలకు ఉపయోగపడే ఏ ఒక్క చట్టాన్ని తీసుకరాలేదన్నారు. ఎన్నో యేండ్లుగా పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు పర్చి కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా ప్రదర్శిస్తుం దన్నారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అప్పగిస్తుందని విమర్శించారు. ఒక వైపు దేశ ప్రజలంతా కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మోడీ ప్రభుత్వం పార్లమెంటులో తమకున్న మందబలంతో ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకరావడం విడ్డూరంగా మారిందన్నారు. కష్టాల్లో ఉన్న పేద ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను కారుచౌకగా ప్రయివేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న మేధావులపై రాజద్రోహం కేసులు నమోదు చేసి నిర్భాంధాన్ని అమలు చేస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడం కోసం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చిందన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపడుతున్న పోరాటాలను గుర్తించి రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నో పోరాటాలతో కార్మికులు సాధించుకున్న కార్మిక హక్కులను లేబర్ కోడ్ పేరుతో సవరణలు చేసి పరిశ్రమ అధిపతులకు కార్మికుల శ్రమను దోచిపెడుతుందన్నారు. వ్యవసాయ కార్మికులు సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చుతూ బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదన్నారు. ఫలితంగా వ్యవసాయ కూలీలు పనులు లేక పస్తులుండే పరిస్థితి మోడీ ప్రభుత్వం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కోరబోయిన కుమారస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నమిండ్ల స్వామి, సీపీఐ పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్, శ్రామిక మహిళ జిల్లా నాయకురాలు గుజ్జుల ఉమా, రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ కార్యకర్తలు పాల్గొన్నారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు
పోరాటం ఆగేది లేదు
మట్టెవాడ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసు కొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదని ఏఐకేఎస్‌సీసీ అర్బన,్ రూరల్ జిల్లాల కో కన్వీనర్లు రాచర్ల బాలరాజు, శ్రీనివాసు, సింగతి సాంబయ్యలు అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారతదేశాన్ని రక్షించు కోవటానికి దేశ వ్యాప్తంగా నిరసన చేయాలనే జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఏఐకేఎస్సీసీి నాయకులు ఎన్రెడ్డి హంసారెడ్డి అధ్యక్షతన సోమవారం హెడ్ పోస్టాఫీస్ సెంటర్లో వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందూ దేశ భక్తి పేరుతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రక టనలు చేస్తూ హిందూ టెర్రరిజాన్ని అమలు చేస్తు న్నదన్నారు. రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు ఫోజులు కొట్టి మోడీ ప్రభుత్వానికి తాబేదారుగా మారిపోయిందన్నారు. ఎనిమిది నెలల కాలంలో జరిగిన పార్లమెంటు సమా వేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు రైతు వ్యతిరేక చట్టాల పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేదన్నారు. రైతు రక్షణ పార్టీగా చెప్పుకునే ఎంపీలు పార్లమెంట్లో కళ్ళు చెవులు మూసుకున్నారన్నారు. దేశ సహజ వనరుల, ప్రభుత్వ రంగ పరిశ్రమల, వ్యవసాయ రంగ రక్షణ కోసం ఉద్యమాలు చేస్తామని అన్నారు. రైతు సంఘాల నాయకులు వీరగోని శంకరయ్య, నెట్టెం నారాయణ, బండి కోటేశ్వరరావు, సుద్ధమల్ల భాస్కర్ పాల్గొన్నారు.
వేలేరు : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు వేల్పుల రవి ఆధ్వర్యంలో సోమవారం రైతు వ్యవసాయ, కార్మిక, వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా మండల తహశీల్దార్ దేవులపల్లి సమ్మయ్యకి వినతి పత్రాన్ని అందించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన గత ఏడు సంవత్సరాల నుండి సరళీకరణ విధానాల వల్ల ఆకలి చావులు పేదరికం పెరిగి పోయాయని అవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేసి ఆహార భద్రతను దెబ్బ తీసే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిందన్నారు.. వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భద్రయ్య, లక్కీరెడ్డీ మల్లారెడ్డి, అజ్మీర్, సురేష్, వెంకన్న పాల్గొన్నారు.
పర్వతగిరి : మండల కేంద్రంలో భారత రక్షణ దినం పాటిస్తూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా సోమవారం అంబేద్కర్ సెంటర్ వద్ద ప్లకార్డ్స్ పట్టుకొని సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. నాయకులు జిల్లా రమేష్, మాదాసి యాకోబు మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని అన్నారు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ నాయకులు బొంపల్లి రుక్మిణి, అరుణ, రైతుసంఘం నాయకులు జిల్లా రాములు, బాలే కుమారస్వామి, సుధాకర్, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు చిన్న మాల నరసయ్య, నీరటి రమేష్, బొట్ల శ్రీధర్, నవీన్, వ్యకాస నాయకులు కుమారస్వామి పాల్గొన్నారు.
హసన్ పర్తి : క్విట్ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వరంగల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం హసన్‌పర్తి మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటి తహశీల్దార్ శ్రావన్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వరంగల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు మాట్లాడారు. బ్రిటిష్ సామ్రాజవాదులకు వ్యతిరేకంగా 1942 లో ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమం జరిగిందన్నారు. దేశ రక్షణ కోసం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగస్టు 9న సేవ్ ఇండియా కార్యక్రమం దేశ వ్యాప్తంగా జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వలన రైతులకు పెద్దఎత్తున నష్టం జరుగుతుందన్నారు. గత 8 నెలుగా ఢిల్లీలో ప్రధాన రోడ్ల పై నిరసన జరుగుతుందని 600 మంది రైతులు చనిపోయారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సీఐటీయూ మండల కార్యదర్శి పుల్ల అశోక్, పెండ్యాల రవి, దేవరకొండ రమేష్, పద్మ, రాజు, స్వామి, వరుణ్ పాల్గొన్నారు.
నెక్కొండ రూరల్ : క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో నేడు కార్పోరేట్ శక్తుల కబంధహస్తాల్లో బందిగా ఉన్న ఇండియా విముక్తి కోసం సేవ్ ఇండియా స్ఫూర్థితో ఉద్యమాన్ని చేపడుతామని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఆరెల్లి క్రిష్ణ, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కందిక చెన్నకేశవులు అన్నారు. నెక్కొండ మండలం కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో ఏఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సేవ్ ఇండియా పేరుతో నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాయకులు శ్రీను, వెంకట్, శ్రీను, సాయిలు, శ్రీనివాస్, రమేష్, రాజు, రమేష్, సతీష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.