Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మహిళా సంఘాలకు ఎన్డీఆర్ఎఫ్ పోలీస్ బృందం విపత్తు సహాయక చర్యలపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడారు. సమాజానికి విపత్తులు ఎదురైనప్పుడు, అకాల వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రాథమిక సహాయక చర్యలపై వివరించారు. వరదల్లో,నదీ ప్రవాహంలో చిక్కుకున్న వారిని, పరికరాల సాయంతో ఎలా కాపాడవచ్చో వివరించారు. విపత్తులను,ఊహించని ప్రమాదాలను ఎదుర్కొనే ధైర్యం మహిళలలో ఉండాలని అన్నారు. మన ఇంట్లో కూడా అనేక ప్రమాదాలు జరుగుతాయని అప్రమత్తంగా ఉంటే జరిగే నష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. లోతట్టు గ్రామాలు జలమయం కావడం, అడవులు తగలబడి పోవడం, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తమ బృందం సిద్ధంగా ఉంటుందన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగ పడతాయని సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు. విపత్తులు వచ్చినప్పుడు వారితోపాటు తమ వంతు సహకారం అందిస్తామని ఎంపీపీ బి రాణి బాయి అన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు వివోలు, ఏపి ఎం,మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు,విపత్తు నిర్వహణ బృందం శిక్షకులు పాల్గొన్నారు.