Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్‌కుమార్
నవతెలంగాణ-తాడ్వాయి
ఆదివాసీలకు రక్షణ కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్‌కుమార్ విమర్శించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సర్పంచ్ ఇర్ప సునీల్ అధ్యక్షతన మండల కేంద్రంలోని కొమురం భీమ్ విగ్రహానికి అరుణ్‌కుమార్ నివాళ్లర్పించి జెండా ఎగరేశారు. మండలంలోని కాల్వపల్లిలో ఏఎస్యూ రాష్ట్ర నాయకుడు కొప్పుల రవి జెండా ఎగరేసి మాట్లాడారు. గంగారం పంచాయతీ పరిధిలోని బంజరలో సర్పంచ్ గౌరబోయిన నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో జెండా ఎగరేశారు. చింతలమోరి గొత్తికోయగూడెంలోనూ ఆదివాసీ జెండా ఎగరేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో అరుణ్‌కుమార్ మాట్లాడారు. 1982లో 179 దేశాల ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి సూచన మేరకు ఆగస్టు 9న సమావేశమై నాటి నుంచి అదే రోజు ప్రపంచ ఆదివాసీ దినం నిర్వహించాలని ప్రకటించినట్టు తెలిపారు. ఇప్పటివరకు 39 ఏండ్లు గడచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. భారత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలను అణిచి వేయడంలో పోటీ పడుతున్నాయని మండిపడ్డారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని, తీవ్ర భయానక వాతావరణంలో ఆదివాసీలు ఉన్నారని తెలిపారు. ఇంటర్నేషనల్ ఇండిజీనియస్ పీపుల్స్ డే సందర్భంగా ఆదివాసీ తెగల, భాషల, మానవ హక్కుల రక్షణ చట్టాలను చేపట్టాలని సూచించిన నేటికీ పీసా, 1/70, తదితర చట్టాలను పాలకులు అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ చరిత్రకు, పోరాటాలకు సంబంధం లేని సేవాలాల్ వర్ధంతిని కోట్లాది రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్వహిస్తున్నా కొమురం భీమ్ స్ఫూర్తి కార్యక్రమాలను నిర్వహించకుండా వివక్ష పాటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కుల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కాక నర్సింగ్‌రావు, జిల్లా నాయకులు మోకాళ్ల వెంకటేష్, తాటి నరేష్, ఈక రామయ్య, కొర్నబెల్లి శివయ్య, లక్ష్మీనర్సయ్య, బచ్చలి వెంకటేశ్వర్లు, తిరుపతి, కొర్నిబెల్లి శేషగిరి, తదితరులు పాల్గొన్నారు.