Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం కేసీఆర్ ఎట్టకేలకు ప్రకటించారు. కొన్ని రోజులుగా 'గెల్లు' అభ్యర్థి అనే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి విభాగంలో కీలక పాత్ర పోషించిన 'గెల్లు'కే సీఎం మొగ్గు చూపారు. పదుల సంఖ్యలో అభ్యర్థులను పరిశీలించిన టీఆర్ఎస్ ఎట్టకేలకు స్థానికుడినే రంగంలోకి దింపింది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు సిద్దిపేట నుంచి హుజురాబాద్ రాజకీయాలను నడిపిన మంత్రి హరీష్‌రావు బుధవారం రంగంలోకి దిగారు. హుజురాబాద్, జమ్మికుంటలో ఆయన పర్యటించారు. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై విమర్శలు చేశారు. దీంతో ఇక రగడమేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అభ్యర్థిని ఖరారు చేయలేదు. రెండ్రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నికలో ఇక మంత్రి హరీష్‌రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్య వాగ్యుద్ధానికి తెరలేచినట్టేనని భావిస్తున్నారు.
హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో పోరు రక్తికట్టనుంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ను ప్రకటించిన విషయం విదితమే. 12 రోజులుగా ఈటల పాదయాత్ర నిర్వహిస్తూ గ్రామాల్లో పర్యటిస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని, సీఎం కేసీఆర్ చేసిన మోసాన్ని వివరిస్తూ తనను గెలిపించాలని కోరారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. మోకాలి శస్త్ర చికిత్స అనంతరం ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. త్వరలోనే మళ్లీ పాదయాత్ర ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 12 రోజుల పాదయాత్రలో సుమారు 50 గ్రామాలను చుట్టివచ్చారు. సీఎం కేసీఆర్‌పైనా, ఆయన కుటుంబసభ్యులపైనా విమర్శలు గుప్పిస్తూ పాదయాత్రతో ముందుకు సాగారు. ఈటల పాదయాత్రలో బీజేపీ సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు వివేక్, జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, వరంగల్ అర్భన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు తరుచూ పాల్గొంటున్నారు.
మంత్రి హరీష్‌కు అగ్నిపరీక్షే..
తెలంగాణ ఏర్పడక ముందు, అనంతరం అన్ని ఎన్నికల్లో మంత్రి హరీష్‌రావు కీలక పాత్ర పోషించారు. ఆయన రంగంలోకి దిగాడంటే టీఆర్ఎస్ గెలిచినట్టే. అందుకే ఆయనకు ట్రబుల్ షూటర్‌గా పేరొచ్చింది. చాలా ఎన్నికలను ఆయన ఒంటిచేత్తో గెలిపించారు. అలాంటి ఆయన దుబ్బాక ఉపఎన్నికలో ఓటమిని ఎదుర్కోక తప్పలేదు. అక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, హరీష్‌రావు నడుమ మాటల యుద్ధం నడిచింది. ఎట్టకేలకు దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలిచారు. ఈ క్రమంలో హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపించడం హరీష్‌రావుకు గట్టి సవాలే. ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోతే మంత్రి హరీష్‌రావు ప్రతిష్ట మసకబారే అవకాశముంది.
సీఎం కేసీఆర్ పక్కా స్కెచ్..
దుబ్బాక ఉపఎన్నికలో ఓడిపోయాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీగా నష్టపోయాక, నాగార్జునసాగర్‌లో గెలవడానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులను విడుదల చేశారు. దీంతో ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. అదే ఫార్మూలాను సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఉపఎన్నికలో అమలు చేస్తున్నారు. ఈటల రాజేందర్‌ను ఓడించి మరో నేత తనను సవాల్ చేయకుండా ఉండడానికి ఎన్ని కోట్లైనా ఖర్చు చేయడానికి సీఎం సిద్ధపడ్డారు. విపక్షాలు విమర్శిస్తున్నా కొత్త పథకాలు ప్రవేశపెడుతూ నిధులు విడుదల చేస్తూ జీఓలు జారీ చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టులో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గానికి తాజాగా రూ.500 కోట్లను విడుదల చేశారు. ఇప్పటికే హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాల్టీలకు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను విడుదల చేస్తూ జీఓలిచ్చిన విషయం విదితమే. అనధికారికంగా ఖర్చు చేయడం కంటే అధికారికంగానే ఖర్చు చేస్తూ ఎన్నికల్లో విజయం సాధించడానికి సీఎం కేసీఆర్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థిగా 'గెల్లు'
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. సుమారు 15-20 మంది నేతల పేర్లను పరిశీలించిన సీఎం వీణవంక మండలంలోని హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. స్వరాష్ట్ర ఉద్యమం లో విద్యార్థి రంగంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకే సీఎం మొగ్గారు. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీసీ నేతనే బరిలోకి దింపాలని సీఎం కేసీఆర్ యోచించారు. ఇందులో భాగంగానే 'గెల్లు' అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
16న సీఎం సభ
హుజురాబాద్‌లో ఈనెల 16న సీఎం కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించడానికి టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సభలోనే గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా సీఎం కేసీఆర్ పరిచయం చేయనున్నారు. మంత్రి హరీష్‌రావు ఇప్పటికే హుజురాబాద్‌లో పర్యటించడం ప్రారంభించడం, 16న సీఎం సభ జరుగనుండడంతో నియోజకవర్గంలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.